NTV Telugu Site icon

TSRTC : నాటి త్యాగ‌ధ‌నుల పోరాట ప‌టిమ‌ స్పూర్తిదాయం

Tsrtc

Tsrtc

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం సంస్థ‌ వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌, ఐ.పి.ఎస్ టి.ఎస్‌.ఆర్టీసీ కేంద్ర కార్యాల‌యం, బ‌స్‌భ‌వ‌న్ లో జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేయ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నాడు సాగించిన ప్ర‌జా సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను, నాటి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ సంక‌ల్పించాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

నాటి పోరాట ప‌టిమ‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా ఆలోచింపజేసే విధంగా త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఒక ద‌శాబ్ధం క్రితం తాను వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, మెద‌క్‌లో ప‌ని చేసిన రోజుల్లో ప్ర‌జ‌లు నాటి ర‌జాక‌ర్ల దురాగతాల గురించి మాట్లాడుకునే వార‌ని చెబుతూ నిజాం తూటాల‌కు బ‌లైన మొద‌టి వీరుడు దొడ్డి కొముర‌య్య చ‌రిత్ర‌లో నిలిచిపోయార‌ని కీర్తించారు. ఈ పోరాట ప‌టిమ‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు క‌ళ్యాణ్ కర్ణాటక, మరాఠ్వాడ ప్రాంతాల ప్ర‌జ‌లు ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు. అలాంటి ప్రాంతాల సంద‌ర్శ‌న‌లో భాగంగా రెండు ద‌శాబ్ధాల క్రితం జ‌న‌గాం ఎ.ఎస్‌.పిగా భైరాన్‌ప‌ల్లి గ్రామాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు నాడు ఎదుర్కొన్న ఘ‌ట‌న‌ల్ని త‌న‌కు వివ‌రించార‌న్నారు.

ర‌జాక‌ర్ల ఆకృత్యాల‌ను, సామూహిక ఆత్యాచార సంఘ‌ట‌నల్ని త‌ల‌చుకుని వారు ఎంత‌గానో బాధ ప‌డ్డార‌ని నాటి రోజుల్ని గుర్తు చేశారు. ఎన్నో బాధలను దిగమింగ‌డంతో పాటు అనేక కష్టాలను చవిచూసి, ఎన్నో అన్యాయాలను సహించిన నాటి ప్ర‌జ‌లు తుద‌కు సామూహికంగా ప్ర‌జా సాయుధ పోరాటం జ‌రిపి విజ‌యం సాధించిన రోజును మ‌రిచిపోలేమంటూ వారి త్యాగ‌నిర‌తిని శ్లాఘించారు. స్వాతంత్ర భార‌త దేశంలో తెలంగాణ విలీనం అయ్యేంత వ‌ర‌కు సాధించిన‌ ఘ‌న చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌డంతో పాటు భావి త‌రాల‌కు తెలియ‌జేయాల్సిన‌ బాధ్య‌త అంద‌రిపై ఉంద‌నే విష‌యాన్ని మ‌ర‌వ‌కూడ‌ద‌ని చెప్పారు.

నాటి త్యాగ‌మూర్తుల ఆశ‌య సాధ‌న‌కు అంద‌రం కృషి చేసి తెలంగాణ రాష్ట్ర‌, దేశ ప్ర‌గ‌తికి బాట‌లు వేయాల‌ని ఆయ‌న కోరారు. కార్యక్రమంలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ డా.ర‌వింద‌ర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ (ఎ,ఎం, పి అండ్ ఎఎం) ఎస్‌.కృష్ణ‌కాంత్, ఇ.డి (ఒ), సంస్థ కార్య‌ద‌ర్శి మునిశేఖ‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్ (వి అండ్ ఎస్‌) సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, సి.ఎఫ్‌.ఎం విజ‌య పుష్ఫ, సీఈ (ఐటీ) రాజ‌శేఖ‌ర్, సీటిఎం జీవ‌న్ ప్ర‌సాద్, సీపీఎం ఉషాదేవి, త‌దిత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేశారు.