NTV Telugu Site icon

Vasireddy Padma: పవన్‌ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma: ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. భారీ స్థాయిలో మహిళల అదృశ్యమయ్యారన్న ఆయన.. మహిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యంపైనే ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోందన్నారు. ఏపీనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్న పవన్.. ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని తెలుసుకోవాలన్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అంటూ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు అంటూ మండిపడ్డారు. తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదని ప్రశ్నించారు.

“ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా??. మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే, ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పరు. పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?. వాలంటీర్ల క్యారెక్టర్‌పై మాట్లాడుతున్నారు కనుక మేం కూడా ప్రశ్నిస్తున్నాం. మహిళల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి, మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది.” అని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Also Read: Minister KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్‌పై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన సమాచారంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. పార్లమెంట్‌ సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అద్యశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు మిస్సింగ్ అవుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీశారు. ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేపు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతారా అని పవన్ కళ్యాణ్ బుధవారం ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖను, డీజీపీని మహిళా కమిషన్ డిమాండ్ చేస్తుందా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడడం గమనార్హం. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఆమె విరుచుకుపడ్డారు.