Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..

Varupula Subbarao

Varupula Subbarao

Varupula Subbarao Resigns from YSRCP: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది.. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వరుపుల సుబ్బారావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు పరుపుల సుబ్బారావు.. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు..

అయితే, వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో తన సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. తన వయసు ఎక్కువైందని వైఎస్ జగన్ గతంలో చెప్పేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వరుపుల సుబ్బారావు వెల్లడించారు. అయితే జనసేన నుంచి తాను ఎలాంటి పదవి లేదా ప్రత్యేక కమిట్‌మెంట్‌ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014-2019 మధ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, కాకినాడ జిల్లాలో ఇటీవల వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా, జనసేనలో చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.