Site icon NTV Telugu

Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి.. హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Vangalapudi Anitha

Vangalapudi Anitha

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా? అని హోంమంత్రి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సిట్ దర్యాప్తు, ఇతర అంశాలపై చర్చ జరిగింది.

సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం వైఎస్ జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయి. రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో తొక్కిపారేయ్యడం జరుగుతున్నాయి. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాము. ప్రసన్నకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చెల్లి అవుతారు. అయినా చెల్లి వరస అయ్యే మహిళపై నీచాతి నీచంగా మాట్లాడారు. అంటే ప్రసన్న మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా?’ అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.

Also Read: YS Jagan: చంద్రబాబు కాలేజ్ రోజులను గుర్తుపెట్టుకుని.. ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారు!

‘వైఎస్ జగన్ మానసిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎలా ఉందంటే.. తల్లి, చెల్లిపై మాట్లాడినా కూడా నోరు మెడపని పరిస్థితి ఆయనది. మేం ప్రజాసేవ కోసం కుటుంబ సభ్యులను వదిలి వస్తున్నాం. ఎన్‌సీఎల్‌టీలో తల్లిపై గెలిస్తే విజయమా?. మాట్లాడితే జగన్ పోలీసులపై పడుతున్నారు. ఈ మధ్య జగన్ యాత్రలు.. బల ప్రదర్శన కోసమే అన్నట్లు ఉన్నాయి. పర్యటన సమాచారం పోలీస్ శాఖకు కూడా జగన్ చెప్పాలి. ఒక చనిపోయిన వారి ఇంటికి వెళ్లి బలప్రదర్శన చేస్తారా?. మీటింగ్ పెడతాము అంటే పర్మిషన్ ఇస్తాం. పరామర్శకు ఎప్పుడు ఆయనకు నో చెప్పలేదు. ఒక బండి కింద మనిషి చనిపోతే స్పృహ ఉండదా?. వాట్సప్‌లో ఫర్వార్డ్ చేస్తేనే కేసులు పెట్టారు అన్నారు. రంగ నాయకమ్మపై గుంటూరులో వాట్సప్‌ ఫార్వార్డ్ కే కేస్ పెట్టారు. ట్వీట్, రీ ట్వీట్ చేసినందుకు గౌతు శిరీషపై కేస్ పెట్టారు. జగన్ పాత టూర్ విజువల్స్ ఉపయోగించి తమ సొంత ఛానెల్లో జనం వచ్చినట్టు చూపిస్తూన్నారు. ఇవాళ నెల్లూరులో జనం లేకపోతే పాత టూర్ విజువల్స్ తమ ఛానెల్ వెబ్ పేజ్‌లో ఉపయోగించుకున్నారు. జగన్ నిజంగా యాత్రలు చెయ్యాలంటే ప్రశాంతి రెడ్డి ఇంటికి వెళ్లి పరమర్శించాలి’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Exit mobile version