India vs Afghanistan: భారత క్రికెట్‌లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..

India Afghan

India Afghan

India vs Afghanistan: భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు మన జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ చిరస్మరణీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇకపై స్వదేశంలో జరిగే ప్రతీ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కి ముందు వందేమాతరం గేయాన్ని ప్లే చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. అయితే, సాధారణంగా పాడే కొన్ని పంక్తులు కాకుండా, ఏకంగా మొత్తం ఆరు చరణాలను స్టేడియంలో వినిపించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

వందేమాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 6న కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం వందేమాతరం అధికారిక ఆలపన సమయం 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించారు. ఈ గేయం ప్లే అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా నిలబడాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, రేడియో, టీవీలలో రాష్ట్రపతి ప్రసంగాలు ప్రసారమయ్యే ముందు, తరువాత, జాతీయ జెండా పరేడ్ సమయాల్లో మొత్తం ఆరు చరణాల పూర్తి గేయాన్ని ఆలపించడానికి అనుమతించింది.

ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ దీనిపై మండిపడుతూ, “అసలు ఏ కారణం లేకుండా ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందా? భారత క్రికెట్ జట్టు మరింత బలంగా తయారవుతుందా? లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏమైనా పురోగతి సాధిస్తామా? ప్రస్తుతం మన ఎగుమతులు పడిపోయాయి, దేశంపై అప్పుల భారం పెరిగిపోతోంది. నేటి యువత (Gen Z) ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు దీనితో తీరవు కదా! కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో ఒక రకమైన భావజాలాన్ని నిర్మించడానికే ఇదంతా చేస్తున్నారు” అని విమర్శించారు.