ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరుగుతున్న ఈ గ్రూప్-బి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, తన సహచర ఆటగాడు విప్రజ్ నిగమ్ ఇద్దరూ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. ఈ క్రమంలో కిందపడిన వైభవ్ వెంటనే తన భుజాన్ని పట్టుకుని నొప్పితో విలవిలలాడాడు. దీంతో మైదానంలో ఉన్న భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ గాయం తీవ్రమైనది కాకపోవడంతో వైభవ్ కోలుకుని తిరిగి ఫీల్డింగ్ కొనసాగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ షాహీన్స్ (పాకిస్థాన్-ఎ) కెప్టెన్ అబ్దుల్ సమద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉండటంతో మొదట బ్యాటింగ్ చేయడమే సరైన నిర్ణయమని సమద్ తెలిపాడు. కాగా, టాస్ సమయంలో నాణెం భారత్కు అనుకూలంగా పడిందని మ్యాచ్ రిఫరీ పొరపాటున ప్రకటించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత పాక్ కెప్టెన్ అబ్దుల్ సమద్ జోక్యం చేసుకుని టాస్ తానే గెలిచానని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు, తాము కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగే ఎంచుకునేవారమని భారత-ఎ కెప్టెన్ తిలక్ వర్మ పేర్కొన్నాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్లు షామిల్ హుస్సేన్, మాజ్ సదాఖత్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో బౌండరీల వర్షం కురిపిస్తూ పాక్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 6.1 ఓవర్లలోనే పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. షామిల్ హుస్సేన్ 18 బంతుల్లో 33 పరుగులు, మాజ్ సదాఖత్ 19 బంతుల్లో 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

