Vaibhav Sooryavanshi: వరల్డ్‌ రికార్డు బద్దలుగొట్టిన “బేబీ బాస్” వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సృష్టించిన సునామీకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇండియా-ఎ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని రేంజ్‌లో చెలరేగిపోయి సరికొత్త ప్రపంచ రికార్డును తన లిఖించుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 324 స్ట్రైక్ రేట్‌తో లంక బౌలర్లను ఉతికేసాడు. ఇక ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్ (లిస్ట్-ఎ క్రికెట్) చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు.

శ్రీలంకతో జరిగిన ఈ టైటిల్ పోరులో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ కౌశల్ వీరరత్నే పేరిట ఉండేది. ఆయన 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా, ఇప్పుడా రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. విశేషం ఏంటంటే, ఇందులో సింగిల్స్ కానీ, డబుల్స్ కానీ తీసి ఒక్క రన్ కూడా పరిగెత్తలేదు. కొట్టిన ఆ పది బౌండరీల ద్వారానే 50 పరుగులు వచ్చేశాయి. కేవలం ఒక్క బంతి మాత్రమే డాట్ కాగా, ఈ ఇన్నింగ్స్ మొత్తంలో అతని స్ట్రైక్ రేట్ 450 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

×
×
Ad

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వైభవ్ తనపై వచ్చిన విమర్శలన్నింటికీ బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. అంతకుముందు శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో టీమిండియాను గెలిపించలేకపోయాననే అసంతృప్తిలో వైభవ్ ఉన్నాడు. ఆ సమయంలో లంక ఆటగాళ్లు అతనిపై స్లెడ్జింగ్‌కు దిగడంతో మైదానంలో స్వల్ప తోపులాట జరిగింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో, వైభవ్ మాటలతో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అన్నట్లుగానే ఫైనల్ మ్యాచ్‌లో లంక బౌలర్లను చీల్చిచెండాడుతూ తన ఆగ్రహాన్ని రన్స్ రూపంలో చూపించాడు. వయసు పరంగా కేవలం 15 ఏళ్ల చిన్నపిల్లాడే అయినా, క్రీజులోకి వస్తే మాత్రం బౌలర్లకు కాలయముడిలా మారుతున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.