Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!

Vaibhav Sooryavanshi Dambulla

Vaibhav Sooryavanshi Dambulla

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో.. దాంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్ ఒక కీలక మలుపుగా నిలిచిపోనుంది. వైభవ్ ఈ మ్యాచ్‌లో ఓ సరికొత్త సవాలును ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లకు వైభవ్‌ను ఎలా అవుట్ చేయాలనేదే పెద్ద చిక్కుముడిగా ఉండేది. దూకుడు, భయం లేని బ్యాటింగ్ శైలి, చిన్న వయసులోనే చూపిస్తున్న మెచ్యూరిటీ అతడిని ఒక అసాధారణ ఆటగాడిగా మార్చేశాయి. కానీ, తాజాగా జరిగిన ఘటన ప్రత్యర్థులకు బంతి ద్వారా కాకపోయినా.. మాటల ద్వారా వైభవ్‌పై ఒత్తిడి పెంచవచ్చనే ఒక కొత్త మార్గాన్ని చూపించినట్లయింది.

ఇక నిన్నటి మ్యాచ్‌ ముగింపు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ టై అవ్వడం, సూపర్ ఓవర్‌కు దారితీయడం, ఆఖరి నిమిషంలో భారత్ ‘ఎ’ జట్టు ఓడిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం క్రికెట్ కంటే ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అక్కడ ఎవరు మొదలుపెట్టారు, ఎవరి తప్పు ఎంత అనేది పక్కనబెడితే.. వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆ సమయంలో తన భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేకపోయాడనేది స్పష్టంగా కనిపించింది. ప్రపంచ క్రికెట్‌లో ఎంతటి గొప్ప ఆటగాళ్లనైనా పరిశీలిస్తే.. కెరీర్‌లో ఒకానొక దశలో ప్రత్యర్థులు వారి సాంకేతిక లోపాలను కాకుండా, వారి మానసిక దృఢత్వాన్ని పరీక్షించడం మొదలుపెడతారు. లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం కెరీర్ ఆరంభంలో స్లెడ్జింగ్‌ను ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్ తొలినాళ్లలో ప్రత్యర్థులపై తీవ్రమైన దూకుడు ప్రదర్శించి, ఆ తర్వాత కాలంలో ఆ కోపాన్ని, ఎనర్జీని పరుగుల రూపంలోకి ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రీడల్లో ఇది సర్వసాధారణమైన వ్యూహం. బ్యాట్‌తో ఆటగాడిని ఆపలేనప్పుడు.. మాటలతో అతని మైండ్‌ గేమ్‌ను దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తుంటారు.

×
×
Ad

వైభవ్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అండర్-19 ఆసియా కప్‌లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో అతనికి ఇలాంటి వివాదమే నడిచింది. దీనర్థం వైభవ్ క్రమశిక్షణ లేని ఆటగాడని కాదు. అతను ఇంకా 15 ఏళ్ల వయసులోనే ఉన్నాడని, అనుభవం ద్వారా నేర్చుకునే ప్రక్రియలో ఉన్నాడని మాత్రమే ఇది సూచిస్తోంది. ప్రతి పెద్ద ఆటగాడూ తన కెరీర్‌లో ఈ దశను దాటుకుని వచ్చినవాడే. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైభవ్ ఇప్పుడు కేవలం ఒక ప్రతిభావంతుడైన కుర్రాడు మాత్రమే కాదు.. భారత క్రికెట్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ ఫేస్. మైదానంలో అతని ప్రతి షాట్, ప్రతి కదలిక, ప్రతి హావభావంపై కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి తరుణంలో కొన్ని మాటల ద్వారా వైభవ్ సహనాన్ని దెబ్బతీయవచ్చని ప్రత్యర్థి జట్లు భావిస్తే.. భవిష్యత్తులో వారు ఖచ్చితంగా ఇదే వ్యూహాన్ని మళ్లీ మళ్లీ ప్రయోగిస్తారు. అందుకే దాంబుల్లా ఘటనను కేవలం మైదానంలో జరిగిన ఒక చిన్న గొడవలా చూడలేం. ఇదొక హెచ్చరిక, అలాగే ఒక గొప్ప పాఠం. అయితే, వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే.. ఇప్పటివరకు తన క్రికెట్ ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలు నుంచి చాలా వేగంగా నేర్చుకుంటూ వచ్చాడు. అతని బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ఎదుగుదలే ఇందుకు నిదర్శనం. కాబట్టి, ఈ చేదు అనుభవం నుంచి సైతం అతను ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటాడనడంలో సందేహం లేదు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లు కేవలం పరుగులు చేయడం వల్లే గ్రేట్ అవ్వరు.. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టాలని చూసినా, తమ సహనం కోల్పోకుండా కేవలం బ్యాట్‌తోనే సమాధానం చెప్పినప్పుడే వారు లెజెండ్స్ అవుతారు. దాంబుల్లా మ్యాచ్ ద్వారా ప్రత్యర్థుల చేతికి ఒక కొత్త ఆయుధం దొరికిన మాట నిజమే. మరి వైభవ్ సూర్యవంశీ ఆ ఆయుధాన్ని ఎంత త్వరగా నిర్వీర్యం చేస్తాడో వేచి చూడాలి.