Vaibhav Sooryavanshi: యావత్ ప్రపంచ క్రికెట్ లోనే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. జింబాబ్వే పర్యటనలో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఏకాంగంగా అత్యంత పిన్న వయస్సులో మ్యాన్ అఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్‌ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రాడ్‌మన్ తరహా టెక్నిక్:
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. డాన్ బ్రాడ్‌మన్‌ను అడ్డుకునేందుకు అప్పట్లో ప్రత్యర్థి జట్లు ‘బాడీలైన్’ బౌలింగ్‌ను ఆశ్రయించేవని గుర్తు చేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీపై కూడా బౌలర్లు అలాంటి వ్యూహాన్నే అనుసరించే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
అలాగే వైభవ్ కెరీర్ ఇప్పుడే ప్రారంభ దశలో ఉందని.. అతని బ్యాటింగ్‌కు బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలన్నాడు. బ్రాడ్‌మన్ కూడా ఇలాగే పరుగుల వరద పారించినప్పుడు ప్రత్యర్థులు బాడీలైన్ వ్యూహాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా బ్రాడ్‌మన్‌ను గుర్తు చేస్తోందని.. ముఖ్యంగా అతను ఎల్‌బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఊతప్ప వ్యాఖ్యానించాడు.
ప్రత్యేక ఆటగాడిగా నిలుస్తాడు..
వైభవ్ సూర్యవంశీ ఇదే దూకుడుతో పాటు సగటును కూడా నిలబెట్టుకోగలిగితే అతడు అసాధారణ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. వైభవ్ అధిక స్ట్రైక్‌రేట్‌తో పాటు 40ల చివర్లో లేదా 50కు చేరువలో సగటును కొనసాగించగలిగితే అతడు ప్రత్యేకమైన ఆటగాడిగా నిలుస్తాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా డాన్ బ్రాడ్‌మన్ మరిన్ని టెస్టులు ఆడలేకపోయాడు. ఒకవేళ మరో 30 టెస్టులు ఆడి ఉంటే.. ఆయన సగటు 99 కంటే ఎక్కువగానే ఉండేదేమో అనిపిస్తుంది అని అన్నారు.
అదే వైభవ్ బలం..
ప్రస్తుత క్రికెట్‌లో సంప్రదాయ టెక్నిక్‌లకంటే ఆటగాళ్లు తమ సహజ ప్రతిభను ఎక్కువగా నమ్ముతున్నారని ఊతప్ప పేర్కొన్నాడు. అదే వైభవ్ విజయానికి కూడా కారణమని అన్నారు. ఇప్పుడు ఆటగాళ్లు సంప్రదాయ బ్యాటింగ్ లేదా బౌలింగ్ పద్ధతులకే పరిమితం కావడం లేదు. వారి ఒరిజినల్ స్టైల్ ను నమ్ముకొని ఆడుతున్నారు. అందుకే ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో విజయవంతమయ్యాడు. ఇప్పుడు వైభవ్ కూడా తనదైన ఆటతో ముందుకు వెళ్తున్నాడు. అలాగే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో రాణించడం కూడా అభిమానులను ఆకట్టుకుందని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

