Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్‌ సూర్యవంశీ కోచ్ ఫైర్..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతమైన టాలెంట్ ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా భారత జట్టు మేనేజ్‌మెంట్, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీమిండియాలో అరంగేట్రం చేసిన తర్వాత ఓపెనింగ్ స్లాట్ విషయంలో మేనేజ్‌మెంట్ నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటోందని కోచ్ విమర్శించారు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం కోసం సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ పోటీ పడుతున్నారని, అయితే ఎవరికీ సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. ఆసియా క్రీడలకు ముందు అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూను ఓపెనర్‌గా దించిన మేనేజ్‌మెంట్, ఆసియా గేమ్స్‌లో మాత్రం అతన్ని మూడో స్థానానికి మార్చి వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మళ్లీ మార్పులు చేసి తొలి మూడు టీ20ల్లో సంజూకు అవకాశం ఇచ్చి, వైభవ్‌ను మళ్లీ బెంచ్‌కే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైభవ్ ఒక తుఫాను లాంటివాడని, అతనితో పెట్టుకుంటే ఎవ‌రైనా సరే దెబ్బతింటారని కోచ్ హెచ్చరించారు. ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టడం ద్వారా మేనేజ్‌మెంట్ కొత్త తరపు ఆటగాళ్లను తయారుచేయగలమని భ్రమిస్తోందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలను తయారు చేయాలంటే యువ ఆటగాళ్లను కఠినమైన పరిస్థితుల్లోకి పంపి ఆడించాలని, బెంచ్‌పై కూర్చోబెడితే ఏ ఆటగాడూ ఎదగలేడని దిగ్గజాలు కూడా చెబుతున్నారని గుర్తుచేశారు. ఇంతటి అద్భుతమైన ప్రతిభ ఉన్న వైభవ్‌ను పక్కన పెట్టడం సరికాదన్నారు. ప్రస్తుత భారత టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహారశైలిని ఆయన ఏకంగా ‘నిరంకుశత్వం’ (డిక్టేటర్‌షిప్) అంటూ విమర్శించారు. వైభవ్‌కు అసలు అవకాశమే ఇవ్వకూడదని మేనేజ్‌మెంట్ ముందుగానే ఫిక్స్ అయిందేమోనని, ఆటగాడిని మానసికంగా విసిగించి నీళ్లు మోయించే పనులు చేస్తున్నారని ఆరోపించారు.