Site icon NTV Telugu

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోరం.. భవనం పైభాగం కూలి ఐదుగురు మృతి

Up

Up

ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మధురలోని బాంకే బిహారీ దేవాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం పైభాగం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఐదుగురిలో ముగ్గురు కాన్పూర్‌కు చెందినవారిగా గుర్తించారు. వారు బాంకే బిహారీ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జేసీబీ సాయంతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.

Read Also: Heart Attack Treatment: గుండె చికిత్సలపై సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌.. ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు..

ఈ ఘటనపై ఎస్ఎస్పీ శైలేష్ పాండే మాట్లాడుతూ.. జిల్లాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోందని.. వర్షం కారణంగా సాయంత్రం ఇంటి పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిందని తెలిపారు. స్థానికులు ఈ ఘటనపై సమాచారం అందించారని.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిచినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. వారు ఆ భవనాన్ని పరిశీలిస్తున్నారని.. భవనంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నట్లు గుర్తించినట్లయితే, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా, భవనాన్ని కూల్చివేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో జనాలు భయాదోళనకు గురయ్యారు.

Exit mobile version