Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలు.!

Kcr

Kcr

Uttam Kumar Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీతో పాటు కేసీఆర్‌ పాదయాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని ఉత్తమ్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ విషయంలో కేసీఆర్‌ చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. “నీళ్ల సమస్యకు రెండు కారణాలు.. కేసీఆర్‌, ఎల్‌నినో” అని ఉత్తమ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఇరిగేషన్‌ శాఖను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ పనితీరు సున్నా అని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టును సరిగ్గా నిర్మించి ఉంటే ప్రస్తుత సమస్యలు వచ్చేవి కావని ఉత్తమ్‌ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే విషయంలో మార్పులు చేయడం ఘోర తప్పిదమని అన్నారు. ఆ మార్పులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణ శస్యశ్యామలం అయ్యేదని వ్యాఖ్యానించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎవరు అడ్డుపడ్డారని ఉత్తమ్‌ రెడ్డి ప్రశ్నించారు. “ఎస్‌ఎల్‌బీసీ పూర్తయిందా? డిండి పూర్తయిందా?” అంటూ కేసీఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌ మాట్లాడితే అన్నీ తనకే తెలుసన్నట్లుగా వ్యవహరిస్తారని, అయితే పనితీరు మాత్రం జీరో అని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. ఇరిగేషన్‌ అంశంలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉండటం మంచిదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ భాషపై కూడా మంత్రి స్పందించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ బూతులు మాట్లాడినప్పుడు హీరోలాగా ఫీల్‌ అయ్యారని, అదే భాషను ఆయనపై ఉపయోగిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాజకీయ భాషను చెడగొట్టింది కేసీఆర్‌ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ బీజేపీకి సరెండర్‌ అయిందని ఉత్తమ్‌ రెడ్డి విమర్శించారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ లొంగిపోయినప్పుడు ఇక చర్యలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.