Uttam Kumar Reddy : తెలంగాణ కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతంగా ఉన్నట్లు చూపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తాజా కులగణన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వేలో బీసీ జనాభా పెరిగిందని పేర్కొంటూ, గులాబీ పార్టీ సర్వేతో పోలిస్తే తమ కులగణనలో ఓసీల సంఖ్య తగ్గిందని వివరించారు.
ఓటర్ల లిస్టు ప్రకారం గ్రామాల్లో ఉన్నవారే హైదరాబాద్‌లోనూ ఉంటారని, కాబట్టి ఓటర్ల సంఖ్యతో కులగణన సర్వే గణాంకాలను పోల్చడం సరికాదని మంత్రి ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగిన సామాజిక న్యాయ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మంత్రి, బీఆర్‌ఎస్ హయాంలో సమగ్ర కులగణన రిపోర్ట్ వెలువడినట్లు తనకే తెలియలేదని, అలాంటిది ప్రజలకు ఎలా తెలుస్తుందన్నారు.
బీజేపీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కులగణన నిర్వహించలేదని, అలాంటివారు ఇప్పుడు తెలంగాణలో విమర్శలు చేయడం దారుణమని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే నేడు కులగణన సర్వే నిర్వహించగలిగామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఒక్క జిరాక్స్ లాగా కాకుండా, అన్ని రకాల సంక్షేమ పథకాల అమలుకు మద్దతుగా వినియోగించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కులగణన క్రెడిట్ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకే చెందుతుందని ఆయన అన్నారు. సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ గణాంకాలను అసెంబ్లీ క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ద్వారా వివరిస్తుందని వెల్లడించారు.
Balakrishna : “బాలయ్య బాబు = ఎమోషనల్”.. లోకేష్ చెప్పిన కొత్త భాష్యం