USA-India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన భారీ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై దీని ప్రభావం ఎంతగానో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలపై అధిక సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో వివిధ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనేక దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక స్థాయిలో టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయని, ముఖ్యంగా భారతదేశం అమెరికా ఆల్కహాల్ ఉత్పత్తులపై 150% సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు.
Read Also: Chittoor Crime News: చిత్తూరు కాల్పుల ఘటన.. దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి!
అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పర చర్యను నమ్ముతారని, అన్ని దేశాల మధ్య సమకాలీన వాణిజ్య విధానాలు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కానీ, కొన్ని దేశాలు తమ మార్కెట్లను అమెరికా ఉత్పత్తులకు పరిమితం చేయడానికి అధిక సుంకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ఉదాహరణకు, కెనడా అమెరికా నుంచీ వచ్చే ఛీజ్, బటర్‌పై 300% టారిఫ్ వసూలు చేస్తోంది. అలాగే, జపాన్ అమెరికా బియ్యంపై ఏకంగా 700% సుంకాన్ని విధిస్తోంది. ఈ నేపథ్యంలో, అధ్యక్షుడు ట్రంప్ పరస్పర ప్రతీకార సుంకాలను అమలు చేయాలని నిర్ణయించారని ఆమె వివరించారు.
భారతదేశం సహా ఇతర దేశాలు అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్నందున ఏప్రిల్ 2 నుంచి ఆ దేశాలపై భారీ ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నట్లు ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ సమావేశంలో స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై కూడా అమెరికా ప్రతీకార టారిఫ్‌లు విధించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా కెనడా ఉక్కు, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% సుంకాలను 50% వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. కెనడా ఆంటారియో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌పై అదనపు సుంకాలను విధించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
ఇది ఇలా ఉండగా, ట్రంప్ ప్రకటనల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటే, ఇది ప్రపంచ వ్యాపార సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే, ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాన్ని మరింత ముదురుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.