Venus Williams Comeback at 45 with US Open 2025 Singles: ‘వీనస్ విలియమ్స్’.. ఈ పేరు సదరు టెన్నిస్ అభిమానికి తెలిసే ఉంటుంది. ఈ అమెరికా స్టార్ రాకెట్ వదిలేసి 16 నెలలు అయింది. యుఎస్ ఓపెన్ 2023లో చివరగా ఆడిన వీనస్.. గర్భాశయ కణితులకు శస్త్ర చికిత్స చేసుకున్నారు. దాంతో వీనస్ రిటైర్మెంట్ ఇస్తారని అందరూ అందుకున్నారు. కానీ 45 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ సంపాదించి మరలా రాకెట్ పట్టారు. యుఎస్ ఓపెన్ 2025 సింగిల్స్‌లో పోటీకి సిద్ధమయారు. ఈ వయసులో మరో ప్లేయర్ అయితే రిటైర్ అవ్వడం లేదా కోచ్‌గా మారతారు. కానీ వీనస్ మాత్రం రాకెట్ వదిలేయకుండా మరలా బరిలోకి దిగుతున్నారు.
వీనస్ విలియమ్స్ ముందుగా రిలీ ఒపెల్కాతో కలిసి యుఎస్ ఓపెన్ 2025 మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీలో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నారు. తాజాగా సింగిల్స్ డ్రాలోనూ వైల్డ్‌కార్డ్ ఎంట్రీని సంపాదించారు. దాంతో రెనీ రిచర్డ్స్ తర్వాత సింగిల్స్‌లో ఆడబోతున్న పెద్ద వయస్కురాలిగా రికార్డులో నిలిచారు. రెనీ 1981లో 47 ఏళ్ల వయసులో ఆడారు. ఈ వయసులో మిక్స్‌డ్ డబుల్స్ అయితే ఫర్వాలేదు కానీ.. యువ క్రీడాకారిణులతో సింగిల్స్ ఆడడం పెను సవాలే అనే చెప్పాలి. వీనస్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేటప్పటికి ప్రస్తుతం సింగిల్స్ డ్రాలో ఉన్న చాలా మంది అమ్మాయిలు పుట్టకపోవడం విశేషం. ఏదేమైనా వీనస్ పట్టుదలకు సలాం కొట్టాల్సిందే.
వీనస్ విలియమ్స్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు చాలానే సాధించారు. 2000, 2001 యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి 14 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. అలానే ఆమె ఖాతాలో రెండు మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు కూడా ఉన్నాయి. 1997లో తొలి గ్రాండ్‌స్లామ్ ఆడిన వీనస్.. అయిదు ఒలింపిక్ పతకాలు గెలిచారు. సెరెనా విలియమ్స్ రాక ముందు హవా వీనస్‌దే. 2002-03 సీజన్లలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. వీనస్, సెరెనా వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరారు. అయితే అన్నింటిని సెరెనానే గెలిచారు. 2017 తర్వాత వీనస్ తన మునుపటి ప్రదర్శన చేయలేకపోయారు. సెరెనా ఇప్పటికే రాకెట్ వదిలేసిన విషయం తెలిసిందే.