US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!

Us Iran War Tensions

Us Iran War Tensions

US Plans Strike on Iran: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా, ఆ దేశాన్నే లేకుండా చేసేందుకు కంకణం కట్టుకుంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ‘యుఎస్ సెంట్రల్ కమాండ్’ (CENTCOM) అధికారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్‌పై తీసుకోవాల్సిన నిర్ణయాత్మక సైనిక చర్యల గురించి సుదీర్ఘంగా వివరించారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ హై-లెవల్ బ్రీఫింగ్‌లో ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యూహాలను ట్రంప్‌కు వివరించారు. జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ సైతం ఈ సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే, అమెరికా కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భారీ సైనిక చర్యకు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.

ఇరాన్‌ను దెబ్బకొట్టేందుకు CENTCOM ప్రధానంగా ‘షార్ట్ అండ్ ఇంటెన్స్’ వ్యూహాన్ని ట్రంప్ ముందు ఉంచింది. అంటే తక్కువ సమయంలోనే ఇరాన్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేయడం దీని లక్ష్యం. దీంతో ఇరాన్‌ను లొంగదీసుకుని, అణు కార్యక్రమాల విషయంలో మళ్లీ చర్చల మేజు వద్దకు తీసుకురావడమే వాషింగ్టన్ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అత్యంత వేగంగా, కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే హైపర్ సోనిక్ ‘డార్క్ ఈగల్’ క్షిపణులను రంగంలోకి దించే అవకాశం ఉందని టాక్. అంతేకాకుండా, గ్లోబల్ ట్రేడ్ దెబ్బతినకుండా ‘హోర్ముజ్’ జలసంధిలోని కొన్ని భాగాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోందట. ఇందులో భాగంగా భూతల దళాలను (Ground Forces) సైతం మోహరించే ప్రమాదం ఉందని, ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సుదీర్భ భేటీలో మరో కీలక అంశం గురించి సైతం ప్రస్తావించారు. ఇరాన్ వద్ద ఉన్న అత్యంత నాణ్యమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడం లేదా వాటిని నిర్వీర్యం చేయడం కోసం అమెరికా ప్రత్యేక బలగాలను (Special Forces) పంపే ఆలోచనలో ఉంది. ఇది నేరుగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసే చర్య కానుంది. దీనిపై స్పందించిన ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. “వారు (ఇరాన్) ఇప్పుడు దాక్కున్నారు, ఎలాగైనా ఒక ఒప్పందానికి రావాలని వారు కోరుకుంటున్నారు” అంటూ గరిష్ట ఒత్తిడి (Maximum Pressure) వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

నేరుగా క్షిపణి దాడులు చేయడం కంటే ‘నౌకాదళ దిగ్బంధనం’ చేయడం సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గమని అమెరికా సైనిక నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా మరింత చితికిపోతుంది. అయితే, అమెరికా ఏ విధమైన చర్య తీసుకున్నా, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలని సైనిక ప్లానర్లు హెచ్చరిస్తున్నారు. ఇక, అమెరికాలో ఈ స్థాయి చర్చలు జరుగుతుండగానే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గురువారం రాత్రి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యాయి. ఆకాశంలో తిరుగుతున్న చిన్న డ్రోన్లు లేదా నిఘా విమానాలను కూల్చివేసేందుకు ఇరాన్ సైన్యం ఈ చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇది కేవలం సైనిక విన్యాసమా లేక అమెరికా దాడుల భయంతో చేసిన అప్రమత్తతా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.