US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Us

Us

US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రగిలిపోయాయి. ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ (IRGC)కి చెందిన ఈ చమురు నెట్‌వర్క్ నెలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జిస్తూ ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. ఒమన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అమెరికా నౌకాదళ నౌకపై ఇరాన్ రెండుసార్లు బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి యత్నించడంతో, దానికి ప్రతీకారంగానే అమెరికా ఈ కఠిన చర్యకు దిగినట్లు పేర్కొంది.

ఈ ప్రతీకార దాడిలో ఒమన్ ఖాతాలో ఉన్న M/T కావిజ్, M/T చార్మినార్, M/T హారిజన్ 1, M/T రీస్కో అనే నాలుగు ట్యాంకర్లతో పాటు, ఖార్గ్ ఐలాండ్ సమీపంలోని M/T దరియా అనే ఐదవ ట్యాంకర్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అయితే, దాడులకు ముందే ఆయా ట్యాంకర్లలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపించినట్లు సెంటాకామ్ తెలిపింది. ఖార్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించగా, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. కాగా సెప్టెంబర్ 5న కూడా మూడు ఇరాన్ ట్యాంకర్లను అమెరికా ధ్వంసం చేయడం గమనార్హం.

మరోవైపు, అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా బలగాలు ఉన్న ఓడరేవుల్లోకి వచ్చే చమురు నౌకలపై దాడులు చేస్తామని IRGC హెచ్చరించింది. వెంటనే ఆయా ఓడల్లోని సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్, అభహా, నజ్రాన్, జజాన్ నగరాలపై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా 73 మంది గాయపడ్డారు. రెండు దేశాల మధ్య రాజుకున్న ఈ తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ప్రపంచ వ్యాపారానికి ఎంతో కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా సాధారణ నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కుకు చేరాయి. ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.