Wagner Group: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. యూరప్, అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలన్నీ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుందడగా.. అరబ్ సమాజం పాలస్తీనా వెంబడి నిలబడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దారుణ మారణహోమానికి పాల్పడ్డారు. 1400 మందిని హతమార్చారు. దీని తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. దీంట్లో 9 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఇప్పటికే హమాస్ తో పోరాడుతుంటే, లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, హమాస్ కి మద్దతుగా ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తోంది. మరోవైపు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాకు రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ వైమానిక రక్షణ వ్యవస్థను అందించాలని యోచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
Read Also: CM KCR: ముగిసిన రాజశ్యామల యాగం.. మహా పూర్ణాహుతితో పూర్తి
వాగ్నర్ గ్రూప్ ఎస్ఏ-22 వ్యవస్థను హిజ్బుల్లాకు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీనిని పింట్‌సర్-ఎస్1 వ్యవస్థగా పిలుస్తారు. దీంట్లో విమానాలను అడ్డుకునే యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణలు, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు వాగ్నర్ గ్రూప్, హిజ్బుల్లాకు వీటిని విక్రయించలేదు కానీ, ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైతే దీంట్లో హిజ్బుల్లా రంగప్రేవేశం చేసే అవకాశం కనిపిస్తోంది. హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఉంది. మరోవైపు హమాస్ కి కూడా నార్త్ కొరియాలోని కిమ్ ప్రభుత్వం ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1975-90 లెబనాన్ అంతర్యుద్ధ సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ 1982లో హిజ్బుల్లాను స్థాపించింది. హమాస్ తో పోలిస్తే హిజ్బుల్లా సైనికులు ఎక్కువ. వీరి వద్ద లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 1985, 2000, 2006లో ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి.