Site icon NTV Telugu

Nancy Pelosi: నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం.. ఆమె భర్తపై దాడి

Nanci Felosi

Nanci Felosi

Nancy Pelosi: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్‌ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. ఆయనపై దాడి అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పెలోసీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Indigo Flight: ఇండిగో ఫ్లైట్‌ ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ రియల్‌ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ క్యాపిటల్ వెంచర్‌ సంస్థ నిర్వహిస్తున్నారు. ఆయనపై దాడికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఆ దుండగుడు ఓ సుత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇంట్లోకి చొరబడిన అనంతరం అతడు నాన్సీ పెలోసీ కోసం వెతికినట్టు తెలుస్తోంది. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్తపై దాడికి పాల్పడినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల నాన్సీ పెలోసీ చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటన అనంతరం తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Exit mobile version