US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు

Us Iran Peace Deal

Us Iran Peace Deal

US Iran Tensions: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా 9,000 మందికి పైగా సైనికులను (7,000 మంది నావికులు, 2,000 మంది మెరైన్లు) యుద్ధనౌకల్లో మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు. యుఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యుఎస్ఎస్ మేకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్‌లతో పాటు యుఎస్ఎస్ చోసిన్, యుఎస్ఎస్ జాన్ పి. ముర్తా, యుఎస్ఎస్ యాంకోరేజ్ వంటి కీలక యుద్ధనౌకలు ఈ కేటాయింపుల్లో ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ విమాన వాహక నౌకలతో పాటు యుఎస్ఎస్ బాక్సర్ గ్రూప్ ఉన్నాయి. గతంలో సుదీర్ఘకాలం మోహరించిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ స్థానంలో, పసిఫిక్ మహాసముద్రం నుంచి జార్జ్ వాషింగ్టన్‌ను ఇక్కడికి తరలించారు. అక్టోబర్ చివరినాటికి ఏకంగా మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లు అక్కడకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా నౌకాదళ బలం అక్కడ 20,000 దాటిపోవడమే కాకుండా వందలాది యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. 2003 తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఒకేసారి మూడు అమెరికా క్యారియర్ గ్రూప్‌లు మోహరించడం, మొన్నటి ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

ఈ సైనిక కదలికల నడుమ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇస్రేల్ వైపు వెళ్తున్న ఒక విమానంలో భారత సంతతికి చెందిన స్మిత్ మచ్ఛార్‌‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు యత్నించిన కో-పైలట్‌ వెనుక ఇరాన్ హస్తం ఉందనే సంకేతాలు అందుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఒకవేళ ఇరాన్ పాత్ర నిజమని తేలితే మాత్రం ఆ దేశంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ విమాన దాడితో తమకేం సంబంధం ఉందో ఇరాన్‌కు బాగా తెలుసని, తమ నుంచి కోలుకోలేని దెబ్బ తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను పెంచే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, “అది సాధ్యమే” అని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు వ్యూహాలను బయటకు వెల్లడించలేనని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని తెరుస్తామంటూ ఇటీవల ఇరాన్ పంపిన సీజ్‌ఫైర్ (యుద్ధ విరమణ) ప్రతిపాదనలను తాను తిరస్కరించినట్లు తెలిపారు. గతంలో ఒప్పుకోని విషయాలకు ఇప్పుడు కూడా ఒప్పుకునేది లేదని, ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదన అసలు ఏమాత్రం సరిగ్గా లేదని కొట్టిపారేశారు.