SP – Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!

Sp Congress Alliance

Sp Congress Alliance

SP – Congress Alliance: మరోసారి అధికారం చేపట్టాలని యోగి ఆదిత్యానాథ్.. ఎలాగైనా యోగిని గద్దె దింపాలని ఎస్పీ-కాంగ్రెస్‌ ప్లాన్‌.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు వేగం పుంజుకున్నాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు 26 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఎస్పీ ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్‌కు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..

26 స్థానాలతో ఎస్పీ ప్రతిపాదన
సోమవారం రోజు ఎస్పీ, కాంగ్రెస్ నేతల మధ్య తొలి సమావేశం జరిగింది. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీతో సీట్ల పంపకాల చర్చలకు ఊపొచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రాంపూర్ ఖాస్, ఫరెండా స్థానాలతో పాటు రెండో స్థానంలో నిలిచిన మథుర, ఖేరాగఢ్, జగదీశ్‌పూర్, కిద్వాయ్ నగర్ నియోజకవర్గాలను కూడా ప్రతిపాదిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. మిగిలిన 20 స్థానాలు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ఈ చర్చలపై స్పందించారు. సమావేశంలో చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పామని, కాంగ్రెస్‌కు తమ 26 స్థానాలను ఇచ్చామని పేర్కొన్నారు. మంగళవారం కూడా మరోసారి చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. చర్చలు ముందుకు సాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

120 స్థానాలతో కాంగ్రెస్ జాబితా
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 120 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందించినట్లు సమాచారం. ఈ జాబితాను మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలుస్తోంది. కేటగిరీ-ఏలో 55 స్థానాలను చేర్చారు. వీటిలో కాంగ్రెస్ గట్టిగా పోటీ చేయాలని భావిస్తోంది. కేటగిరీ-బీలో గతంలో మంచి ఫలితాలు సాధించిన నియోజకవర్గాలు ఉండగా, కేటగిరీ-సీలో గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను చేర్చినట్లు సమాచారం. ఈ జాబితాపై ఎస్పీతో చర్చలు జరగనున్నాయి.

181 స్థానాలపై కూడా కాంగ్రెస్ కన్ను
ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 181 అసెంబ్లీ స్థానాల పేర్లను సీట్ల పంపకాల పరిశీలన కోసం ఎస్పీకి అందించినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో 135 జనరల్ స్థానాలు, 45 ఎస్సీ రిజర్వుడు స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వుడు స్థానం ఉన్నాయి. సీట్ల పంపకాల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ, అన్ని స్థానాలను ఎస్పీ కేటాయించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

60 నుంచి 70 సీట్లకే ఎస్పీ మొగ్గు?
కాంగ్రెస్‌కు 60 నుంచి 70 స్థానాలు కేటాయిస్తే సరిపోతుందని పలువురు ఎస్పీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో అత్యధికంగా పోటీ చేసి అసెంబ్లీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని అఖిలేష్‌ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 26 స్థానాల ప్రతిపాదనతో ప్రారంభమైన చర్చలు ఎక్కడ ముగుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.