Union Minister Rajnath Singh: బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ వారికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కారు బేకారు అయిపోయిందని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Also Read: Asaduddin Owaisi: భారతదేశ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “బీజేపీ ఏర్పడిన తొలినాళ్లలో 2 ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఒకటి హన్మకొండ. బీజేపీ అధికారంలోకి వచ్చాక గుజరాత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో ఎందుకు జరగడం లేదు. హైదరాబాద్ మినహా తెలంగాణలో అభివృద్ధి లేదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏపీ, తెలంగాణ సమస్యలను.పరిష్కరించడంలో వైఫల్యం చెందింది. పదేళ్ళలో అభివృద్ధి కొందరికే పరిమితం అయింది. ఒక ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు, బీజేపీ అంగీకరించదు. హుజూరాబాద్ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసినా ఈటెల గెలిచారు. కేసీఆర్ రంగంలోకి దిగినా ఈటెల గెలుపును అడ్డుకోలేక పోయారు. కేసీఆర్ మీరిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితి కేసీఆర్‌ది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఏమైంది.. దళిత బంధు అన్నారు ఎంతమందికి ఇచ్చారు.” అంటూ ప్రశ్నించారు.