NTV Telugu Site icon

Kishan Reddy: కేసీఆర్‌ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైంది..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో రామ్ జీ గోండు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని.. దేశవ్యాప్తంగా పది ట్రైబల్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియంకు పనులు జరుగుతున్నాయన్నారు. ఆనాటి కేసీఅర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు.

Read Also: Telangana Assembly: కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఇవాళ ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయంకు భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 900కోట్లు మొదటి ఫేజ్‌లో గిరిజన యూనివర్శిటీకీ కేటాయించామన్నారు. రూ.420కోట్లతో 17ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గిరిజనులకు భూముల హక్కులను కూడా కల్పిస్తున్నామన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.