Telangana Assembly: కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిలపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆనాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్‌ఎస్ బండారం బయట పెడతామన్నారు. సమగ్ర సర్వే వివరాలు బయటపెడ్తే తమకు ఖర్చు తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టలేదని మంత్రి విమర్శించారు. బలహీన వర్గాల కోసమే తమ పోరాటమని ఆయన చెప్పారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసమే తాము పోరాటం చేశామన్నారు. 2011 చట్టం చేయకుండానే ఓబీసీల కులగణన జరిగిందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read Also: Kishan Reddy: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
కులగణనపై కేటీఆర్ మాట్లాడుతూ.. “కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టమని కేసీఆర్ అడిగారు.. తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం.. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉంది. బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలి. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అప్పుడే కులగణన సఫలం అవుతుంది. శాసనసభను మరో 2 రోజులు పొడిగించాలి. కులగణనపై బిల్లులు తీసుకురావాలి.” అని కేటీఆర్ సూచించారు.