Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) లోక్‌సభలో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న ఆమె, మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఇక బడ్జెట్ ముఖ్యాంశాల విషయానికి వస్తే.. బడ్జెట్ ప్రసంగం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 53 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. గత ఏడాది 2024-25 బడ్జెట్ రూ. 48.2 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రుణాల రూపంలో గత బడ్జెట్‌లో రూ. 14 లక్షల కోట్లు సమకూర్చుకోగా, ఈసారి మాత్రం అంత స్థాయిలో రుణ అవసరం లేదని అంచనా వేస్తున్నారు.
Also Read: Road Accident: నార్సింగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వైద్యుడు మృతి
సాధారణ, మధ్య తరగతి వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా పలు నిర్ణయాలు వచ్చే అవకాశమున్నాయి. ఆదాయపు పన్ను శ్రేణుల్లో మార్పులు ఉండొచ్చు. కొత్త స్లాబ్‌లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రోత్సాహకాలు పొందుతున్న 14 పరిశ్రమల జాబితాలో మరిన్ని రంగాలను చేర్చనున్నట్లు సమాచారం. అలాగే స్టాక్ మార్కెట్‌ను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు ఉండొచ్చు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) తగ్గించే అవకాశం లేకపోలేదు. లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్ టాక్స్ (LTCG) తగ్గించే అవకాశం ఉంది.
మరోవైపు సాంకేతిక రంగానికి కూడా పెద్దపీట వేయనుంది కేంద్రం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను వైద్య రంగం, రవాణా రంగాల్లో మరింత ఉపయోగించేలా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఇంకా వ్యవసాయం, మహిళా సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండనుంది. అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య రంగం ఇంకా భారత ఎగుమతులపై అమెరికా పెనాల్టీ ట్యాక్స్ విధించొచ్చన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక జరగబోయే అసెంబ్లీ సమావేశాల ప్రణాళికను చూస్తే.. తొలి విడత 9 రోజులు కొనసాగనుండగా, మార్చి 10 – ఏప్రిల్ 4 వరకు 18 రోజులపాటు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 (సోమవారం) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక NDA ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి కొంత ఆర్థిక సహాయం అందే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో 2025-26 బడ్జెట్ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంత మేర ఉపయోగపడుతుందో అని సామాన్యులు వేచి చూస్తున్నారు.