15 thousand crores for the development of AP Capital Amaravati: బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలమ్మ చెప్పారు.
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని ఆర్థిక మంత్రి స్పష్టం చేయలేదు.