Ugadi 2024: ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఉగాది సంబరం’ పేరుతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అందరికి క్రోది నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో వెంకయ్య నాయుడు ముందుంటారని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని శక్తివంతం చేయడంలో వెంకయ్య నాయుడు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. దేశం 5వ శాంతివంతమైన ఆర్థిక శక్తిగా ఉందని.. దేశం మరింతగా ముందుకు వెళ్తుందన్నారు. పంచాంగాన్ని మన పూర్వీకులు మనకు ఇచ్చారన్నారు. పంచాంగం ఆధారంగానే దేశంలో పండగలను, కార్యక్రమాలను జరుపుకుంటామని.. వేరే భాషలు మాట్లాడుతున్నప్పటికి మనదంతా ఒకటే ధర్మమని గవర్నర్ తెలిపారు. తెలుగుకు ఉన్న ప్రాముఖ్యత చెప్పలేనిదన్నారు. మనది దృఢమైన సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశమని తెలిపారు. గతంలో తమిళనాడులో పార్టీ ఎలా ముందుకు వెళ్లాల్లో వెంకయ్య సూచించారని.. పార్టీలు వెళ్తున్న తీరును వెంకయ్య నాయుడు గమనిస్తారన్నారు.
Read Also: Youtube: ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు.. 2.25 మిలియన్ వీడియోలు తొలగింపు
ఉగాది శుభాకాంక్షలు: కిషన్ రెడ్డి
రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. మంచి వర్షాలు పడి, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
2027 నాటికి మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ : వెంకయ్యనాయుడు
ఈ ఉగాది నాడు భారత్‌ను సూపర్ పవర్‌గా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకుందామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు సూచించారు. దేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు. సూపర్ పవర్‌గా ఉన్న అమెరికా లాగా మనం ముందుకు వెళ్తున్నామన్నారు. వేషం, భాషా వేరైన మనమంతా భారతీయులం.. దేశాన్ని ముందుకు తీసుకెళ్దామన్నారు. 2014లో ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న భారత్.. నేడు ఐదో స్థానానికి చేరిందన్నారు. 2027 నాటికి మూడో ఆర్ధిక వ్యవస్థగా దేశం చేరనుందన్నారు. అన్ని వ్యవస్థలను ప్రజలను అందుబాటులోకి ఉంచేలా ప్రధాని మోడీ చేశారన్నారు. దేశాన్ని ముందుకు నడపడంలో ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. గతాన్ని గుర్తుకు పెట్టుకుని.. వర్తమానంలో ముందుకు నడవాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోపేరుతో ఉగాదిని పిలుచుకుని.. జరుపుకుంటారని ఆయన తెలిపారు. మతం, భాష వేరైనా మనమంతా భారతీయులమన్నారు. కులం, మతం పేరుతో విడదీయరాదని.. ఉగాది వెనుక సంప్రదాయమే కాదు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయన్నారు. క్రమ శిక్షణ, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.. రెండో అత్యన్నత పదవికి చేరుకున్నానన్నారు. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.