Udayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కు కీలకపదవి కట్టబెట్టారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మళ్లీ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ బుధవారం యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆ ప్రకారం, యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి నాలుగోసారి ఎంపికయ్యారు. గత కమిటీలో ఉన్న పలువురికి ఈ సారి అవకాశం దక్కలేదు. అదే సమయంలో గత కమిటీలో నలుగురు సంయుక్త కార్యదర్శులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచారు. కొత్తగా నియమితులైన వారిలో ఎనిమిది మంది 2012 నుంచి యువజన విభాగం పదవుల్లో కొనసాగుతున్న వారే. యువజన విభాగం కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన ఎమ్మెల్యే ఉదయనిధి బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆశీస్సులందుకున్నారు. మళ్లీ పదవి చేపట్టడంతో బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Read Also: China Iphone : ఐఫోన్ కంపెనీలో ఆందోళన.. పొట్టపొట్టుగా కొట్టుకున్నరు
ఇదిలా ఉండగా డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ఎంపీ కనిమొళి తొలుత నుంచి వ్యవహరిస్తూ వచ్చారు. ఆమెకు ప్రమోషన్ ఇచ్చి డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో మహిళా విభాగం బాధ్యతలను మరొకరికి అప్పగించాలని నిర్ణయించారు. తాజాగా ఈవిభాగంలో సమూలంగా మార్పులు చేశారు. ఆ విభాగం అధ్యక్షురాలిగా విజయ దయాల్ అన్భును నియమించారు. ప్రధాన కార్యదర్శి పదవిని కన్యాకుమారి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హెలెన్ డేవిడ్సన్‌కు కట్టబెట్టారు. సంయుక్త కార్యదర్శిగా కుమారి విజయకుమార్, ఉపాధ్యక్షులుగా భవానీ, మంత్రి కయల్‌వెలి సెల్వరాజ్ నియామకమయ్యారు.