NTV Telugu Site icon

Air Show: పోర్చుగల్‌ ఎయిర్‌ షోలో రెండు విమానాలు ఢీ, పైలట్‌ మృతి.. వీడియో

Air Show

Air Show

Air Show: ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్‌ షోలో డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సుమారు 30 ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్ షో ప్రారంభమైంది. పైలట్లు తమ సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు విమానాలు గాల్లో ప్రదర్శన చేస్తున్నాయి. అందులో ఓ విమానం మరోదానిని ఢీకొట్టింది. దీంతో అది కుప్పకూలిపోయింది.

Read Also: Encounter: పుల్వామాలో బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు

ఈ ఘటనలో స్పెయిన్‌కు చెందిన పైలట్‌ అక్కడికక్కడే మరణించగా.. పోర్చుగల్ కు చెందిన మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని బెజా దవాఖానకు తరలించామని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తరలించారు. ప్రమాదానికి గురైన విమానాలు యాకొవెల్వ్‌ యాక్‌-2 అని, అవి సోవియట్‌ డిజైన్డ్‌ ఏరోబేటిక్‌ ట్రైనింగ్‌ మోడల్‌కు చెందినవని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోర్చుగల్‌ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోషకరమైన సందర్భం కాస్తా విషాదంగా మారిందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునో మెలో తెలిపారు. ప్రమాదానికిగల సరైన కారణం ఏమిటో అప్పుడే తెలుస్తుందన్నారు. పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో మాట్లాడుతూ సరదాగా, సంతోషంగా సాగాల్సిన సమయం కాస్తా విషాదాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ షోను నిర్వాహకులు సస్పెండ్ చేశారు.