Rains Effect: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం, శుక్రవారాల్లో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురు, శుక్రవారాల్లో సెలవులు ఇచ్చినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే.. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తు్న్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.