కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు..
వీటిలో ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా, ఒకరు సంగారెడ్డి లో చనిపోయారు.. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు.. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవసాత్తు కిందపడి మరణించారు..