Twitter: ఎలన్ మస్క్ వచ్చినప్పటి నుంచి ట్విట్టర్‌లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఒకే రంగులో వెరిఫికేషన్ టిక్ ఉండేది. కానీ ఇక నుంచి మూడు రంగుల్లో వెరిఫికేషన్ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ గతంలోనే నిర్ణయించింది. సెలబ్రిటీలకు సహా వ్యక్తిగత అకౌంట్లకు బ్లూ టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్ ఇస్తామని ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రకటించారు. తాజాగా ఈ టిక్‌లను ట్విట్టర్ అమలు చేస్తోంది. వార్తలను అందించే ఏఎన్‌ఐ లాంటి సంస్థకు ట్విట్టర్ గోల్డ్ టిక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఖాతాలకు వెరిఫికేషన్ టిక్ ఊదా రంగులో దర్శనమిస్తోంది. దీంతో వినియోగదారులకు ట్విట్టర్ సరికొత్తగా కనిపిస్తోంది.
Read Also: Team India: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్.. సీనియర్ ఆటగాళ్లపై వేటు?
ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఈ టిక్‌లను అమలు చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. బ్లూ టిక్ కావాలంటే 8 డాలర్లు వసూలు చేస్తున్న ట్విట్టర్.. గోల్డ్ టిక్ కావాలంటే ఎక్కువ ధర చెల్లించాలని తెలిపింది. అయితే ధర ఎంత అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా గ్రే టిక్ కోసం కొంత ధరను చెల్లించాల్సి ఉంటుంది. కాగా హింసను ప్రేరేపించే ఖాతాలను నిర్మోహమాటంగా సస్పెండ్ చేస్తామని ఎలన్ మస్క్ ప్రకటించారు. చాలా బోగస్ అకౌంట్లు బ్లూ టిక్‌ను తీసుకుంటున్నాయని.. వీటిని ఆపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.