Twitter Blue Ticks: ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్‌లో భారీ మార్పులు సంభవించాయి. గతంలో ట్విట్టర్‌లో బ్లూటిక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.719 చందా కడితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నకిలీ ఖాతాలకు కూడా బ్లూటిక్కులు దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఎక్కువ నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్ కనిపిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ దుర్వినియోగం అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amazon Huge Loss: ఆ కారణంతో రూ.82లక్షల కోట్ల సంపద కోల్పోయిన అమెజాన్
కాగా గతంలో ట్విట్టర్‌లో బ్లూటిక్ రావాలంటే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులకు మాత్రమే అధికారిక గుర్తింపులను తనిఖీ చేసిన తర్వాత ఈ సదుపాయం కల్పించే వారు. కానీ ఇప్పుడు నిబంధన మార్చడంతో కేటుగాళ్లకు అవకాశం కల్పించినట్లు అయ్యింది. దీంతో మారుపేర్లు, ఫోటోలతో నకిలీ ఖాతాలు సృష్టించి రూ.719 కట్టేసి బ్లూటిక్ పొందుతుండటంతో అసలు ఎవరో నకిలీ ఎవరో తేల్చడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం ఎవరైనా ఎవరి పేరు, ఫోటోతో నకిలీ ఖాతా ప్రారంభించినా దానికి బ్లూ టిక్ ఇచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నకిలీలకు ట్విట్టర్ అధికారిక గుర్తింపు ఇవ్వడం ద్వారా గందరగోళ పరిస్థితులు తలెత్తబోతున్నాయి. దీంతో పలువురు ట్విట్టర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా అయితే ట్విట్టర్‌లో కొనసాగడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అంశాన్ని ట్విట్టర్ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో వేచి చూడాలి.