ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాహుల్ మీనా చెప్పారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉంది. నేడు కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఆ 10 మంది కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వారే. 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాలేదు. 15 మంది కౌన్సిలర్లతో కోరం లేకపోవడంతో.. వైస్ చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ దేశాలు మేరకు తదుపరి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రకటన వెలువడవలసి ఉందన్నారు.
తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 30 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఒక కౌన్సిలర్ మృతి చెందగా, మరొక కౌన్సిలర్‌కి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. 28 మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే. నాలుగు రోజుల కింద పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తన వర్గం 17 మంది కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే ఉన్నారు. 17 మందిలో నలుగురు తమకు సపోర్ట్ చేస్తారని టీడీపీ ప్రకటించడంతో దాడిశెట్టి రాజా అలర్ట్ అయ్యారు. ఈరోజు తుని పురపాలక కార్యాలయానికి వెళ్లేందుకు వైసీపీ కౌన్సిలర్లు యత్నం చేయగా.. టీడీపీ శ్రేణులు రావడంతో ఛైర్ పర్సన్ ఇంట్లోకి వెళ్లారు.