Site icon NTV Telugu

Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!

Tulip Garden

Tulip Garden

Asia’s Largest Tulip Garden: జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్‌ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్‌ అధికారులు తెలిపారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను శనివారం పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు అధికారులు తెలిపారు. మార్చి 19న ప్రారంభమైన తులిప్ ఫెస్టివల్‌ 20 రోజుల పాటు జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో వివిధ రంగుల తులిప్‌లు పూయడం ప్రారంభించినందున ప్రజల కోసం తెరవబడిందని ఫ్లోరికల్చర్ శాఖ అధికారులు తెలిపారు. “తులిప్ గార్డెన్‌ను పర్యాటకుల కోసం తెరిచారు” అని ఆ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ వెల్లడించారు.

Read Also: Rekha Jhunjhunwala: సముద్ర వ్యూ చెడిపోతుందని.. రూ.118 కోట్లతో బిల్డింగ్ మొత్తాన్ని..

తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అధికారులు అన్నారు. ఈసారి జరిగే తులిప్‌ ఫెస్టివల్‌లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్‌ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్‌ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న 68 రకాల తులిప్‌లకు ఈ ఏడాది ఐదు కొత్త రకాల తులిప్‌లను చేర్చినట్లు ఫ్లోరికల్చర్ శాఖ తెలిపింది. మరో రెండు లక్షల తులిప్ మొక్కలను జోడించి తులిప్ గార్డెన్ విస్తీర్ణాన్ని కూడా పెంచింది. 55 హెక్టార్లలో విస్తరించి ఉన్న తోటలో రికార్డు స్థాయిలో 17 లక్షల తులిప్ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. తోటలో వివిధ రకాల పువ్వులు, రంగులను జోడించడానికి హైసింత్స్, డాఫోడిల్స్, మస్కారి, సైక్లామెన్స్ వంటి ఇతర స్ప్రింగ్ పువ్వులు కూడా ప్రదర్శనలో ఉంటాయని వారు తెలిపారు.

Read Also: Neha Sharma: చిరుత నటి పొలిటికల్ ఎంట్రీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో నేహా!

ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌ను జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 2007లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేశారు. నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న 50,000 తులిప్ మొక్కలతో గార్డెన్‌ చిన్న స్థాయిలో ప్రారంభమైంది. అనంతరం తక్షణమే జనాదరణ పొందింది. ప్రతి సంవత్సరం సందర్శకుల సంఖ్యతో పాటు తులిప్ రకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది స్వదేశీ, విదేశీయులైన 3.65 లక్షల మంది సందర్శకులు గార్డెన్‌ను సందర్శించగా, 2022లో 3.60 లక్షల మంది ప్రజలు వచ్చారు.తులిప్ గార్డెన్ చలనచిత్రాలు, వీడియోలను చిత్రీకరించడానికి ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. సందర్శకుల సౌకర్యార్థం డిపార్ట్‌మెంట్ దాదాపు 22,000 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ స్థలాన్ని జోడించిందని అధికారి తెలిపారు.

Exit mobile version