బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మోడీ భారీ విజయంతో గెలుపొందారు. మూడోసారి ముచ్చటగా ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు రంగంలోకి దిగారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో సోమవారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 99 స్థానాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఈ రెండో లిస్టులో కీలక మైన వ్యక్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా బీజేపీ-కాంగ్రెస్-జనసేన పార్టీలో పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ సెకండ్ లిస్టులో ఏపీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
రెండో జాబితాలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో తాజాగా రాజీనామా చేసిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు బసవరాజు బొమ్మై, జగదీష్ షెట్టార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు రెండో జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖ నుంచి జీవీఎల్.నరసింహారావు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ శనివారంలోపు.. ఏదొక రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
