Site icon NTV Telugu

TTD Update: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఆర్జిత సేవాటికెట్ల జూన్‌ కోటా విడుదల!

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల లక్కీడిప్‌ రిజిస్ట్రేష‌న్‌ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. లక్కీడిప్‌ ద్వారా టికెట్లను పొందిన భక్తులు మార్చి 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించి టికెట్లు తీసుకోవచ్చు.

మార్చి 21న వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను.. 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా.. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మరింత సమాచారం కోసం భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Exit mobile version