Site icon NTV Telugu

TSRTC Bandh: తెలంగాణలో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు..

Tsrtc Bandh

Tsrtc Bandh

TSRTC Bandh: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వార్ కొనసాగుతుంది. ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం బిల్లుపై కొన్ని వివరణలు కోరారు గవర్నర్‌ తమిళి సై. 2023 TSRTC బిల్లులోని నిబంధనలను పరిశీలించిన గవర్నర్‌ తమిళిసై… అస్పష్టతలపై ప్రభుత్వం నిర్ధిష్టమైన వివరణలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పష్టత కోసం ప్రభుత్వ వివరణ కోరుతున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణ ప్రత్యుత్తరాన్ని గవర్నర్ కోరారని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు గవర్నర్‌ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఉదయం రెండు గంటలపాటు 8 గంటల వరకు బస్సుల నిలిపివేత కొనసాగుతుంది. ఆ తర్వాత రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉదయం 11గంటలకు పీవీమార్గ్ నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరతారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెచ్చిన బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.

ఇక, ఆర్టీసీ విలీన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. అయితే గవర్నర్ వివరణ కోరడంతో ఈ బిల్లు.. ఇవాళ అసెంబ్లీ ముందుకు వస్తుందా? లేదా అనే సందిగ్థత నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు కోసం సభా సమావేశాల్ని పొడిగిస్తారా? లేదా? అనే సస్పెన్స్‌ నెలకొంది. మరోవైపు ఇదివరకే సభ ఆమోదం తెలిపిన బిల్లులపై అభ్యంతరాలున్నాయని గవర్నర్ తమిళిసై వెనక్కి పంపడంతో.. ఆ నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. రెండో రోజు సమావేశాల్లో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ లో కో-ఆప్షన్ సభ్యుల పెంపుపై కేటీఆర్ ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన బిల్లును హరీష్ రావు ప్రవేశ పెట్టారు. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లును సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశ పెట్టారు. ఈ నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వీటిని గవర్నర్‌ ఆమోదం కోసం ఇవాళ రాజ్‌భవన్‌కు పంపనుంది ప్రభుత్వం.

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. విద్యుత్‌ గురించి మాట్లాడేందుకు తాము సిద్దమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటే… మూడు గంటలు కరెంటు చాలు అన్న వీడియోను సభ అనుమతిస్తే ప్రదర్శిస్తామని బదులిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం ప్రతీ ఆస్పత్రిలోను కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపిస్తే… ఆదిలాబాద్ జిల్లాలో ఆస్పత్రి మునక పాపం స్థలాన్ని ఎంపిక చేసిన కాంగ్రెస్‌దేనన్నారు మంత్రి హరీశ్‌రావు. వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయని, ఎంతమంది చనిపోయారో కనీసం లెక్కలు కూడా లేవని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా చేయకపోవడంతో .. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం 5వందల కోట్లు మాత్రమే పరిహారం ఇస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సభలో ప్రస్తావిస్తే.. మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫీల్డ్‌లోకి వెళ్లి…పంటనష్టాన్ని అంచనా వేశారా అని నిలదీశారు.

Exit mobile version