NTV Telugu Site icon

RS Praveen Kumar : టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

Rs Praveen Kumar

Rs Praveen Kumar

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి,అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని,నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరపాలని అన్నారు.

టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసిన అప్పటి ఛైర్మెన్, సభ్యులను కాపాడడం కోసమే గత ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించిన ఆయన ఇప్పటి వరకూ సిట్ ఎవరినీ ప్రశించలేదన్నారు.టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ విపరీతంగా జరిగిందన్నారు.కేసీఆర్ దొర పాలన పోయి మరో దొర పాలన వచ్చిందే తప్ప,బహుజనుల ఎటువంటి న్యాయం జరుగలేదన్నారు.

ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న గత హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా ప్రభుత్వం గుంజుకొని హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పేరుతో బడా కంపెనీలకు ఎకరాకు రూ.100 కోట్లకు అమ్ముకుందని ఆరోపించిన ఆయన తిరిగి ఆ భూములు పేదలకు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు విడుదల చేయాలన్నారు.గురుకులంలో విద్యార్దిని ఆత్మహత్యపై స్పందించిన ఆయన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సైకాలజీ కౌన్సిలర్లను నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17  స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని, పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించారు. బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్న ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రకల్, దేశి ఇటిక్యాలలో పార్టీ జెండా ఆవిష్కరించారు.