NTV Telugu Site icon

TS TET: టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

Ts Tet

Ts Tet

TS TET: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుండి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 20 వరకు పొడిగించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. సీబీటీ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్‌కు ఇప్పటి వరకు 1,95,135 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో మరోసారి దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.

Read Also: Kishan Reddy: మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. టెట్‌ అర్హత ఉన్నవారికే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. పేపర్‌ 1 పరీక్షకు డీఈడీ అర్హతతోపాటు ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసినవారు జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్‌ 12వ తేదీన టెట్‌ ఫలితాలు విడుదలవుతాయి.