Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!

Trump

Trump

Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి మరో ‘కొన్ని రోజులు’ మాత్రమే సమయం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా మారిపోతుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారని, ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉందని, ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని చెప్పారు. ఇరాన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించనివ్వబోమని పునరుద్ఘాటించిన ట్రంప్.. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుంది లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలోనైనా వెళ్ళడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో సైతం ట్రంప్ మాట్లాడారు. కాల్పుల విరమణ పొడిగింపును స్వాగతించిన ఎర్డోగాన్, ఈ సంక్షోభానికి ఒక సహేతుకమైన పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలు సఫలమైతే మిడిల్ ఈస్ట్‌లో పెద్ద ముప్పు తప్పుతుందనే ఆశలతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చమురు ధరలు దాదాపు 6 శాతం మేర తగ్గాయి. కానీ, ఇరాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవేళ అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగితే, ఈసారి రాబోయే ప్రాంతీయ యుద్ధం కేవలం ఇక్కడితో ఆగదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. అంతేకాకుండా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే సముద్ర రవాణాను నియంత్రించడానికి ఇరాన్ కొత్తగా “పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ”ని కూడా ప్రకటించింది. అమెరికా కొత్త దాడులకు సిద్ధమవుతోందని చెప్పడానికి శత్రువుల బహిరంగ, రహస్య కదలికలే సాక్ష్యమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ గాలిబాఫ్ సోషల్ మీడియాలో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీతో టెహ్రాన్‌లో సమావేశమై ఈ చర్చల పురోగతిపై మాట్లాడారు. చర్చలు, పరస్పర అవగాహన ముఖ్యం అని నఖ్వీ అనగా, ఇరాన్ ఎప్పుడూ దౌత్యానికే కట్టుబడి ఉంటుందని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేశామని, దౌత్య మార్గాలన్నీ తెరిచే ఉంచామని, అయితే ఒత్తిడి తెచ్చి ఇరాన్‌ను లొంగదీసుకోవాలనుకోవడం అమెరికా భ్రమ మాత్రమేనని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో పేర్కొన్నారు. యుద్ధం కంటే పరస్పర గౌరవంతో కూడిన దౌత్యమే ఎల్లప్పుడూ తెలివైనది, సురక్షితమైనది అని అన్నారు.