Anders Vistisen: డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్‌ల్యాండ్ విషయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్నారు. అమెరికాకు ఆ ప్రాంతం కావాలన్న ఆయన వ్యాఖ్యలు యూరప్‌లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇదే కోపం తాజాగా యూరోపియన్ పార్లమెంట్ వేదికపై స్పష్టంగా బయటపడింది. డెన్మార్క్‌కు చెందిన ఎంపీ అండర్స్ విస్టిసెన్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా ఆసక్తి, ట్రంప్ ఒత్తిడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. “ప్రెసిడెంట్ ట్రంప్ గారూ, జాగ్రత్తగా వినండి. గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ రాజ్యంలో 800 ఏళ్లుగా ఉంది. అది అమ్మకానికి పెట్టే వస్తువు కాదు” అని ఆయన అన్నారు. ఆ తర్వాత ట్రంప్‌కు అర్థమయ్యే మాటల్లో చెబుతున్నానంటూ.. “మిస్టర్ ప్రెసిడెంట్, ఫ**ఆఫ్” అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆ మాటలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
READ MORE: CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
అయితే ఈ వ్యాఖ్యలపై యూరోపియన్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నికోలాయ్ స్టెఫానుటా వెంటనే జోక్యం చేసుకున్నారు. ఈ సభలో అలాంటి భాష వాడటం నిబంధనలకు విరుద్ధమని, ఎంత బలమైన రాజకీయ భావాలు ఉన్నా ఇలాంటి మాటలు అంగీకరించబోమని ఆయన హెచ్చరించారు. క్షమాపణ చెబుతూ విస్టిసెన్‌ను ఆపేశారు. ఆ తర్వాత విస్టిసెన్ తన ప్రసంగాన్ని డేనిష్ భాషలో కొనసాగించారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ గత కొద్ది రోజులుగా గ్రీన్‌ల్యాండ్‌పై మళ్లీ బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఖనిజ సంపదతో నిండిన ఆర్కటిక్ ప్రాంతం అమెరికా, నాటో భద్రతకు చాలా కీలకమని ట్రంప్ వాదన. మంచు కరుగుతున్న కొద్దీ రష్యా, చైనా వంటి దేశాలు అక్కడ తమ పట్టు పెంచాలని చూస్తున్నాయని, అందుకే గ్రీన్‌ల్యాండ్ అమెరికాకు అవసరమని ట్రంప్ చెబుతున్నారు. ఇదే క్రమంలో డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచిన యూరోప్ దేశాలపై 25 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ బెదిరింపులు కూడా చేశారు. దీంతో ఆయా దేశాలు ట్రంప్‌పై విమర్శలు కురిపిస్తున్నాయి.