ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అక్కడ ఆయనకు శాసనసభ్యుల నుంచి సుదీర్ఘ చప్పట్లు, హృదయపూర్వక ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్‌కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. హమాస్ చెర నుంచి ప్రాణాలతో ఉన్న బందీలందరూ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ట పెరిగింది.
ట్రంప్‌తో పాటు హాజరైన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును కూడా ఎంపీలు ‘బీబీ’ అని ప్రశంసించారు. డోనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి ముందు, నెస్సెట్ స్పీకర్ అమీర్ ఒహానా సుదీర్ఘమైన పరిచయ ప్రసంగం చేశారు. ట్రంప్ బృంద సభ్యులైన జారెడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, రాయబారి మైక్ హకబీ, గాజా కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించిన ఇతర సీనియర్ అధికారుల పేర్లను పేర్కొన్నారు. ఇజ్రాయెల్ శాసనసభ్యులు కూడా లేచి నిలబడి వారికి చప్పట్లు కొట్టారు.
Also Read:World Cup 2027: రోహిత్, విరాట్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు కూడా ప్రపంచకప్‌లో ఆడడం డౌటే?
ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని నెతన్యాహు అందజేశారు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటారని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రసంగానికి ముందు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. “అబ్రహం ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించినందుకు, వినాశకరమైన ఇరాన్ అణు ఒప్పందం నుండి వైదొలిగినందుకు, ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు మద్దతు ఇచ్చినందుకు, ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌ను ప్రారంభించాలనే మీ సాహసోపేతమైన నిర్ణయానికి ధన్యవాదాలు.. అని నెతన్యాహు అన్నారు. ట్రంప్‌ను “వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుడు” అని ఆయన అన్నారు. ఏ అమెరికన్ అధ్యక్షుడు కూడా ఇజ్రాయెల్ కోసం ఇంత మద్దతు ఇవ్వలేదని నొక్కి చెప్పారు.
