హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న వై జంక్షన్ దగ్గర రన్నింగ్ లో ఉన్న ఆటోపై చెట్టుకూలి డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్ గౌస్ పాషా రాజ్ భవన్ రోడ్డు లోని ఎమ్మెస్ మక్తా వాసిగా గుర్తించారు. ఇతను ర్యాపిడో ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నేడు (శనివారం) మధ్యాహ్నం హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాగ్ వైపు ఆటోలో ఒక్కడే వెళ్తున్నాడు.. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో అక్కడ ఆటోను ఆపివేశాడు. ఈ క్రమంలో ఫుట్ పాత్ పై ఉన్న భారీ వృక్షం సడెన్ గా కూలి నేరుగా ఆటో పై పడడంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఇతని ముందు ఉన్న ఇంకో ఆటో కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందం భారీ వృక్షాన్ని తొలగించారు. కాగా హిమాయత్ నగర్ డివిజన్లో 15 నుంచి 20 చెట్ల వరకు కూలిపోయే స్టేజీలో ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా హర్టికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి ఆరోపణలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగితే తప్ప అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోరని ఆమె మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని బాధితుడికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: MLA Rajasingh: ఏ వేదికపై ఏం మాట్లాడాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు