NTV Telugu Site icon

Bus Travels Ticket Rates: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..! సంక్రాంతికి ఊరెళ్ళేది ఎలా..?

Private Travels

Private Travels

సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు. సంక్రాంతి పండగ రద్దీని ట్రావెల్స్ ఏజెన్సీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. సాధారణ టికెట్ ధర కంటే మూడింతలు, నాలుగింతలు వసూలు చేస్తున్నాయి. ట్రావెల్స్ దందా చూస్తుంటే బ్లాక్ టికెట్లకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు.. ఇప్పుడున్న ఛార్జీలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి సరిపోయే ఖర్చు.. కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలని పరిస్థితి నెలకొంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై మరింత భారం మోపుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే.. ప్రత్యేక సర్వీసుల పేరిట 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు.

సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర రూ.4 వేలు ఉండేది. ఇప్పుడు రూ.6 వేలకు పై మాటే. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సుల్లో గరిష్టంగా రూ.1849 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు రూ.5500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే వోల్వో బస్సు అయితే ఏకంగా రూ.7 వేలు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వోల్వో బస్సు ప్రయాణానికి రూ. 4 వేలు చెల్లించాల్సి వస్తుంది. ట్రావెల్స్ ఏజెన్సీల దందాలేమీ దొంగ చాటుగా జరగడం లేదు. మొబైల్ యాప్స్, వెబ్ సైట్లలో టికెట్ ధరలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. బిజినెస్ లేనప్పుడు ఖాళీగా కూర్చొంటున్నాం.. ఇప్పుడు డిమాండ్ ఉంది గనుక నష్టాలను భర్తీ చేసుకుంటున్నామని ట్రావెల్స్ నిర్వాహకులు అంటున్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది.. ప్రస్తుతం ట్రావెల్స్ ఏజెన్సీల ఆశకు మాత్రం అంతు ఉండటం లేదు. చెప్పిన ధర చెల్సించాల్సిందేనని అంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఇంత జరుగుతున్నా.. అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ కళ్ల ఎదుటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారు అధికారులు. పండగ దగ్గర పడింది.. జనం హడావుడిలో ఉన్నారు గనుక ట్రావెల్స్ ఏజెన్సీలు దండుకుంటున్నాయని అనుకోవచ్చు.

Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ.. ఇవి సూపర్ కార్స్ గురూ..!

పట్టణం పల్లెబాట పట్టింది. ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. పిల్ల పాపలతో ఊర్లకు బయల్దేరడంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో ఎటూ చాలని పరిస్థితి… ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కు బాగా కలిసొస్తుంది. ఎప్పటిలాగే పండగ డిమాండును సాకుగా చూపించి దారి దోపిడీకి తెర లేపాయి ప్రైవేట్ ట్రావెల్స్. సాధారణంగా పిల్లల స్కూళ్లు తాము పని చేసే సంస్థల సెలవులను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు. ఈసారి భోగికి ముందు శని, ఆదివారాలు కావడంతో.. గురు, శుక్ర వారాల నుంచి ఊర్లకు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఇది ట్రావెల్ ఏజెన్సీలకు బాగా కలిసొచ్చింది. రద్దీని సాకుగా చూపించి జనాన్ని దోచుకుంటున్నాయి. గంట గంటకు ధరలు పెంచేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేశామని చెబుతున్నా.. వాటి జాడ లేదంటున్నారు ప్రయాణికులు. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్నా.. అక్కడి నుంచి తమ సొంతూళ్లకు వెళ్లాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

సంక్రాంతి పండగను సొంతూరిలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తారు. అందువల్ల కష్టమో నష్టమూ ఎలాగైనా ఊరికి చేరుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగ బయల్దేరుతున్నందున.. టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. ప్రయాణికుల ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో సంక్రాంతి పండగ వచ్చిందంటే దోపిడీకి తెర లేపడం మాములు అయిపోయింది. సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందే రైళ్లలోని సీట్లు, బెర్తులు రిజర్వ్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు అలాంటి పరిస్థితే.. ప్రత్యేక రైళ్లు, బస్సులు వేసినప్పటికీ జనం రద్దీకి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దొరికినకాడికి దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. దీంతో.. టికెట్ ధరలను విపరీతంగా పెంచి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.

Show comments