Revanth Reddy: వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ విజయభేరీ యాత్ర జరిగింది. అంబేడ్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నాడని విమర్శించారు. మనవడు చిన్నగున్నడు కాబట్టి ఏ పదవి ఇయ్యలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారని.. కేసీఆర్ తెలంగాణ బిడ్డ అయితే పరిగికి గోదావరి నీళ్ళు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆంద్రోడు లేడు పగోడు లేడు కేసీఆర్ తెలంగాణకు పెద్ద శని అంటూ రేవంత్ అన్నారు.
Also Read: Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం
ఓడిపోతే ఫాంహౌస్ లో పడుకుంటా అంటుండు…ఏం రోగమొచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూముల్ని ఆక్రమించిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటికి పంపుతారని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి వేరే ఇంటి మీద వాలితే ఆ కాకిని కాల్చి పడేస్తామన్నారు. 2500 /- రూపాయల నిధి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ. 15000, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఉపాధి హామీ కూలీలకు 12000 , ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి కోసం 5 లక్షల రూపాయలు, 250 గజాల జాగా, ప్రతి నెల 4 వేల పెన్షన్.. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు రేవంత్ రెడ్డి. గుడిలో లింగాన్ని మింగే నాయకుడు పరిగి ఎమ్మెల్యే అంటూ ఆయన విమర్శించారు. ఆయనను కూడా ఇంటికి పంపాలే… పరిగిలో రామ్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. తెలంగాణలో అవినీతి పాలన అంతమొందాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలపాలన్నారు.