Road Accident at Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.. శ్రీశైలం శిఖరం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లోని ఘాట్ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దయ్యాల మలుపు దగ్గర టూరిస్ట్ బస్సు వేగంగా వచ్చిఅదుపు తప్పింది.. దీంతో బోల్తా కొట్టింది.. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ గ్రామం చెందిన 20 మంది భక్తులు.. శ్రీశైలం వస్తుండగా క్షేత్రానికి కూతవేటు దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది..
Read Also: SSC Supplementary Exams: టెన్త్ ఫలితాలు విడుదల.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పడంటే..?
బస్సు డ్రైవర్ మలుపులను అంచనా వేయకుండా అతి వేగంగా రావడమే బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.. ఇక, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది భక్తులు ఉండగా అందులో 10 మందికి కళ్ళు చేతులు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలోను చాలాసార్లు ప్రమాదాలు జరిగినా.. అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు అడుగుల దూరంలో భారీ… సుమారు 100 అడుగుల లోయ ఉంది.. అందులో పడి ఉండి ఉంటే.. బస్సులోని ప్రయాణికులు ఎవ్వరూ బతికేవారు కాదని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, డివైడర్‌ను ఢీ కొట్టి సేఫ్టీ వాల్ ను తగిలి బస్సు బోల్తా పడి ఆగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇక, ప్రమాదం జరిగిన విషయం తెలిసి హుటాహుటిన దేవస్థానం ఏఈవో ఫణిదారు ప్రసాద్, శ్రీశైలం సీఐ, ఎస్ఐ సిబ్బందితో అంబులెన్సులు వేసుకొచ్చి క్షతగాత్రులను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి.. మరికొందరిని సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.