రేపు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు.. వారి హాజరు పై ఉత్కంఠ..!
రేపు(సోమవారం) స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం రానుంది. కాగా.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు.
కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకం
మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు.
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయ్యారు. మొత్తంగా 21 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు బదిలీలు అయ్యారు. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రవీణ్ ఆదిత్ నియామకం అయ్యారు.
ఏపీలో విషాదం.. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు మృతి చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదు
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం ను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త లాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే చాలా భాద అనిపిస్తుందన్నారు కడియం శ్రీహరి. మీరు తిడుతుంటే…మేము పడుతూ ఉంటామా?.. మాకు కూడా చీము,నెత్తురు ఉన్నదిగా….మేము కూడా ఎదో ఒక భాషలో తిట్టాలాగా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్- హరీష్ రావు లను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని, రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
రేపు సీఎం జగన్తో నెల్లూరు నేతల భేటీ..
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపి అధిష్టానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నరసరావు పేటకు అనిల్ కుమార్ వెళితే.. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
నిన్నటి దాక అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా..
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమము, రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉందని అన్నారు. మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యమని అడిగే దమ్ము జగన్ కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేతలు కట్టకట్టుకుని వస్తున్నారని దుయ్యబట్టారు.
కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కోల్‌కత్తాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. 16 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఏక్దిన్ ప్రతిదిన్, ఖరీజ్, అకలేర్ సంధానే వంటి సినిమాలు శ్రీలకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఏక్దిన్ ప్రతిదిన్ మువీకి సీక్వెల్‌గా వచ్చిన కౌశిక్ గంగూలీ ఆమె చివరి సినిమా. క్యాన్సర్ అని తెలిసాకా సినిమాలకు దూరమయ్యింది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీలా తన కెరీర్‌లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. ఇక ఆమెకు భర్త , ఒక కొడుకు ఉన్నారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
పీవీ జిల్లా కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. కోదండరామ్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ జిల్లా కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ అని ఆయన కొనియాడారు. పీవీ జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. ప్రభుత్వంపై బీఆర్‌స్ అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. పైసలతో ఏమైనా చేస్తాం అనే అహంభావం బీఆర్‌ఎస్ నాయకులలో ఉందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి తో పనిచేస్తామని, బీఆర్‌ఎస్ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామిక పాలన అందజేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్.
“నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా నమ్మలేదు”.. బీహార్ రాజకీయాలపై ఓవైసీ ఫైర్…
జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే నితీష్ కుమార్ సీఎం అవుతారని, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్రమోడీ ఇష్టం మేరకే పాలన సాగుతుందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో జేడీయూ జతకట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నితీష్ ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ-బీ టీమ్ అంటూ తమను ఎగతాళి చేసిన నితీష్ కుమార్, ఇప్పుడు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష
మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసేటట్టు కనిపిస్తుందని, కాంగ్రెస్ వచ్చింది..మార్పు మొదలైంది..ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటర్ రిపేర్ దుకాణాలు కొత్తవి వెలుస్తున్నాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఎంపీ ఎన్నికల్లో అక్కడ బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు హరీష్ రావు. రైతు బంధు పడలేదు అంటే చేప్పుతో కొడుతా అని ఓ మంత్రి, ఇంకో మహిళ మంత్రి అగుతాలేద అంటున్నారని, మాట్లాడితే కేసులు పెడుతున్నారు..పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.
నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధాని మోడీ అభినందనలు..
బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీజేపీ మద్దతుతో మరోసారి జేడీయూ-బీజేపీ సర్కార్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, బీహార్‌లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌కి అభినందనలు తెలియజేశారు. ‘ బీహార్‌లో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసిన సామ్రాట్ చౌదరీ, విజయ్ సిన్హాలను అభినందిస్తున్నాను. ఈ బృందం రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులకు పూర్తి అంకిత భావంతో సేవ చేస్తుందనే నమ్మకం నాకుంది’’ అని ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు.
