NTV Telugu Site icon

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సింగరేణిలోని అన్ని విభాగాలపై సమగ్రంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ఉపరితల భూగర్భగనులు మరియు నూతన ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టు మరియు సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణా పై ఆయా విభాగాల డైరెక్టర్ల ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అలాగే సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాల పైన సమీక్షించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి అధికారులు వివరించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వేలం పెట్టిన బొగ్గు బ్లాకుల వివరాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకుని దానిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి దిశ నిర్దేశం చేశారు. అదే విధంగా ఒడిశాలో సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాకు ప్రారంభించడానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. ఒడిశా నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు ఒడిషా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా అధికారులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీని పైన సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు అధికారులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సింగరేణి ని మరింత విస్తరించడానికి బొగ్గు మైనింగ్ కాకుండా ఇతర ఖనిజ అన్వేషణకు రూపొందించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను అడిగారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొనడంతో సంబంధిత అధికారుల సూచనల మేరకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయడం జరిగిందని వివరించారు. సింగరేణి కాలరీస్ సంస్థలు పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన ఆదేశించారు. కార్మికులకు సంస్థ ద్వారా అందిస్తున్న అలవెన్స్ లు, వైద్య సదుపాయం అందిస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. కారుణ్య నియామకాల నియామకాల కోసం జరుగుతున్న మెడికల్ బోర్డు ప్రక్రియ గురించి కులంకుశంగా తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఐఏఎస్, డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ ఎం.సురేష్, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

 

*అన్నారం బ్యారేజీలో డిజైన్ లోపాలున్నాయ్
కరీంనగర్ జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రుల బృందం సందర్శింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి బుంగలు పడి ఇసుక బయటకు వస్తున్న ప్రాంతాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రాజెక్టు లో లోపాలన్ని మానవ తప్పిదాలే… లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా Ntvతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అన్నారం బ్యారేజీలో డిజైన్ లోపాలున్నాయన్నారు. ఒక సమీక్ష నిర్వహించాము… వారు నివేదిక ఇచ్చాక చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మేము పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్ లోపాలు, విధాన పర లోపాలున్నాయని ఆయన తెలిపారు. కాళేశ్వరం పబ్లిక్ హియరింగ్ సమయంలో చెప్పాము అలా అంటే మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. పంప్ హౌస్ లు మునిగినప్పుడు నేను mla గా వెళ్తే నాకు అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈరోజు అందరికీ చూసే అవకాశం కల్పించాము.. మా పాలనకి పారదర్శకత కి నిదర్శనం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పై మా పార్టీ విధానం ఒకటే.. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాలి అనేది మా విధానం అన్నారు. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు. మా ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ బీఆర్ఎస్ మార్చిందని అన్నారు. పదేళ్ళలో ఏం జరిగిందో అందరికి తెలుసునన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు ఖర్చు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుంచి మాకు అనుమానాలు ఉన్నాయన్నాయన్నారు.

 

*న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్ నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు. కాగా.. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్ అమ్ముతున్నాడు బాబు కిరణ్. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబుకిరణ్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నాడు.. ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ జరుపుతున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బాబు కిరణ్ ఉన్నాడు. ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం ఎస్సార్ నగర్ లో భారీ డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. డ్రగ్స్ ను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలు బయటపడుతున్నాయి.

 

*కాకినాడపై స్పెషల్‌ ఫోకస్‌.. పవన్‌ కల్యాణ్‌ పర్యటన పొడిగింపు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.. అంతేకాదు.. 50 డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై ఆయన ఆరా తీశారు.. కొన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయకపోవడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఇక, ఈ రోజు కాకినాడ సిటీపైనే సమీక్ష చేశారు.. అయితే, కాకినాడలో పవన్ కల్యాణ్‌ పర్యటన మరొక రోజు పొడిగించారు.. కాకినాడ సిటీ నియోజకవర్గం పై ప్రత్యేక పోకస్ పెట్టిన జనసేనాని.. మొత్తం 50 డివిజన్‌లు, వార్డులు వారీగా రివ్యూ చేస్తున్నారు.. ఇప్పటి వరకు 15 డివిజన్‌లకు సంబంధించిన జనసైనికులతో సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు.. మిగతా డివిజన్లపై కూడా పూర్తిస్థాయిలో పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.. దీనికి ప్రత్యేక కారణం ఉంది.. వారాహి యాత్రలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డినిని ఓడించి తీరుతానని సవాల్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, దీనిపై స్పందించిన ద్వారంపూడి.. దమ్ముంటే పవన్ కల్యాణ్‌ తనపై పోటీ చేయాలని ప్రతి సవాలు విసిరారు.. దీంతో పవన్‌ కాకినాడపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. కాకినాడ నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయాలని, దాని ప్రభావం జిల్లాపై ఉంటుందని స్థానిక నేతలు కోరుతున్నారు.. ఇక, షెడ్యూల్ ప్రకారం రేపటితో పవన్ కల్యాణ్‌ కాకినాడ టూర్‌ ముగియనుంది. అంటే.. 28, 29, 30 తేదీల్లో కాకినాడలో పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు.. ఇప్పుడు మరొకరోజు పొడిగించడంతో.. 31వ తేదీన కూడా కాకినాడలో పవన్‌ సమీక్షలు కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

 

*ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుంది
గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. నేను కూడా పెడనలోనే ఉండాలని అనుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి జగన్ నేను పెడన నుంచి పోటీ చేయాలా వేరే చోటు నుంచి చేయాలా నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్‌ అన్నారు. ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే వద్దని కొందరు, ఎమ్మెల్యే కావాలని కొందరు అడగటం ప్రతి పార్టీలో ఉంటుందన్నారు. లీడర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. లీడర్ నిర్ణయానికి అందరం కట్టుబడాల్సిందేనని, సీటు – పోటీ విషయంలో పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం అని ఆయన వెల్లడించారు. సంత విషయంపై మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. నాకు పార్టీలో ఎవరితో శతృత్వం లేదు, అందరూ మిత్రులేనని ఆయన అన్నారు. నేను శత్రువని ఎవరైనా అనుకుంటే వాళ్ళే తప్పు చేసినట్టు లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఏ తప్పూ చేయలేదని, నేను ఈ పార్టీలో ఉండి పక్క చూపులు చూడలేదన్నారు. నేను వైసీపీ జెండా మోసాను, ఏ తప్పటడుగు వేయలేదన్నారు.

 

*వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..
ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల వాతావారం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుండందో ఏపీ రాజకియాలు వెడేక్కాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళుండగా.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. ఈ క్రమంలో అనంతరపురంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు‌పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీ లకు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గం లో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు? రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరగాలనుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి’ అని కోరారు.

 

*కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. అమిత్ షా సమక్షంలో సంతకం
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్‌మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది. ఉల్ఫా అనేది అస్సాంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపు. శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. అసోం భవిష్యత్తుకు ఈరోజు ఉజ్వలమైన రోజు కావడం నాకు సంతోషకరమైన విషయమని, చాలా కాలంగా అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయన్నారు. ఉల్ఫా మెమోరాండమ్‌పై సంతకం చేయడం మొత్తం ఈశాన్య ప్రాంతాలకు, ముఖ్యంగా అస్సాంకు శాంతి యొక్క కొత్త కాలం ప్రారంభాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. 2014లో మోదీ తర్వాత ప్రధాని మోదీ ప్రధానమంత్రి అయ్యాక,, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. అరబింద రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా బృందం, ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ శాంతి ఒప్పందం అస్సాంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు తెరపడుతుందని భావిస్తున్నారు. రాజ్‌ఖోవా వర్గం సెప్టెంబర్ 3, 2011న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SOO) ఒప్పందం సంతకం చేయబడింది.అయితే, పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫా యొక్క కరడుగట్టిన వర్గం ఒప్పందంలో భాగం కాదు. చైనా-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు సమాచారం. సార్వభౌమ అస్సాం డిమాండ్‌తో 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుండి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది, దీని కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధిత సంస్థగా ప్రకటించింది.

 

*పాకిస్థాన్‌లో ఈ సారి న్యూఇయర్ వేడుకలు లేవు.. ఎందుకో తెలుసా?
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలను పూర్తిగా నిషేధించామని పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హక్‌ కాకర్ పేర్కొన్నారు. పాక్‌ ప్రధాని ఒక వీడియో సందేశంలో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో అణచివేయబడిన పాలస్తీనియన్ల మారణహోమం, ముఖ్యంగా అమాయక పిల్లల ఊచకోత పట్ల పాక్‌ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “అక్టోబర్ 7, 2023 నుంచి క్రూరమైన ఇజ్రాయెల్ దళాలచే 21,000 మందికి పైగా అమాయక పాలస్తీనియన్లు అమరవీరులయ్యారు, ఇందులో దాదాపు 9000 మంది అమాయక పిల్లలు ఉన్నారు.” అని కాకర్ చెప్పినట్లు డాన్ పేర్కొంది. గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, నూతన సంవత్సరం ప్రారంభంలో సరళతను పాటించాలని కాకర్ పాకిస్తానీ ప్రజలను కోరారు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాద దాడిని, ఇజ్రాయెల్ పౌరులను అపహరించినందుకు పాకిస్తాన్ పాలస్తీనా వాదానికి అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకటిగా ఉంది. యుద్ధంతో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే తాము రెండుసార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామని తెలిపారు. పాలస్తీనియన్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం రెండు సార్లు మానవతా సాయం అందించిందని, త్వరలోనే మరో విడత సాయం పంపబడుతుందని పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని తెలిపారు. అదేవిధంగా, పాలస్తీనియన్లకు సకాలంలో ఉపశమనం కలిగించడం, గాజా నుంచి గాయపడిన వారిని తరలించడం, వారి చికిత్స కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఈజిప్ట్, జోర్డాన్‌లతో సన్నిహితంగా ఉందని ఆయన అన్నారు.

 

*గూగుల్‌పై లా సూట్.. రూ.41 వేల కోట్ల పరిహారం చెల్లింపుకు సిద్ధం?
టెక్ కంపెనీ గూగుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓ కంపెనీ గూగుల్‌కు వ్యతిరేకంగా ‘క్లాస్ యాక్షన్ లా సూట్’ దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ధర్మాసనం విచారించింది. అయితే మొదట ఈ కేసును కొట్టివేయాల్సిందిగా గూగుల్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. గూగుల్ అభ్యర్థన విన్న జడ్జి ఒప్పందం కుదిరే వరకు విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సదరు పిటిషనర్‌కు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైనట్టు సమాచారం. పిటిషనర్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి పూర్తి స్పష్టత లేకున్న న్యాయవాదులు తమ రాజీ ఒప్పందానికి కట్టుబడి ఉంటామన్నారు. దీంతో రాజీ ఒప్పందానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 24కు కోర్టు వాయిదా వేసింది. పటిషినర్‌కు ఎలాంటి అభ్యంతరం లేకుండ ఉంటే ఈ ఒప్పందాన్ని అమోదిస్తామని కోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా ‘ఇన్‌కాగ్నిటో‌’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ తన గూగుల్ అనలిటిక్స్, కుకీస్, యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నదని సదరు కంపెనీ తన పటిషన్‌లో ఆరోపించింది. అయితే దీనిపై గూగుల్ స్పందిస్తూ.. అసలు ‘ఇన్‌కాగ్నిటో మోడ్‌‌ అంటేనే ప్రైవేట్‌గా బ్రౌజింగ్ చేసే పద్దతి, దానిని తీసువచ్చిందే గూగుల్.. ఈ మోడ్‌లో ఇంటర్నేట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ‘బ్రౌజింగ్ హిస్టరీ’ని కుకీస్ ట్రాక్ చేయడం కుదరని గూగుల్ వివరణ ఇచ్చుకుంది. కానీ, పిటిషన్ దాఖలు చేసిన సంస్థ మాత్రం ఇన్‌కాగ్నిటో బ్రౌజ్ చేసిన స్నేహితులు, హాబీలు, ఫేవరెట్ ఫుడ్, షాపింగ్ హాబిట్స్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ దొంగిలిస్తుందని పటిషినర్ నొక్కి చెప్పారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రోజర్స్ గూగుల్‌పై మండిపడ్డారు. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేస్తున్న యూజర్ల డేటాను సేకరించబోమని తాము చేప్పిన వాగ్ధానానికి గూగుల్ కట్టుబడి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ దొంగలించినట్టు 2020లో సదరు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కాలిఫోర్నియా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఉల్లంఘించడమేనని, యూజర్లకు 5000 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేసింది.