నేడు కడపకు వైఎస్ జగన్:
నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్:
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఏపీ, తెలంగాణల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈరోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆప్సనల్ సెలవులు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25, 26 తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే, డిసెంబర్ 26 బాక్సింగ్ డే 2024, కాబట్టి ఈ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి.
ఈనెల 30న కేబినెట్ భేటీ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులు,రైతుభరోసా కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
కేబీఆర్ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000:
బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మకమైన కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ ఫారెస్ట్ (కేబీఆర్) ప్రవేశ టికెట్ ధర పెంచారు. ప్రతి సంవత్సరం కేబీఆర్ పార్క్ ప్రవేశ టికెట్ ధర పెంచుతుండటంతో ఈ ఏడాది కూడా అధికారులు పెంచారు. కేబీఆర్ పార్క్ కు వెళ్లే వాకర్లు, సందర్శకులు పార్క్ సందర్శించేందుకు ప్రస్తుతం పెద్దలు రూ.45, పిల్లలకు రూ.25 ప్రవేశ రుసుము చెల్లిస్తున్నారు. అదే వాకర్స్ అయితే నెల వారీపాస్ రూ.850 చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు కేబీఆర్ పార్క్‌కు వెళ్లాలంటే పెద్దలకు రూ.50, పిల్లలు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. అదే వాకర్స్ అయితే నెల వారీ పాస్ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. అంటే సందర్శకులకు రూ.5పెంచగా.. నెల వారీ పాస్‌కు రూ.150 రుసుమును పెంచారు అధికారులు. వీటిని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులో వస్తాయని ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు. దీనిని సందర్శకులు, వాకర్స్‌లు గమనించాలని తెలిపారు. అయితే ఎంట్రీ ఫీజుపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్:
నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. అయితే, యూఎస్ లో జరిగే భారత కాన్సుల్స్ జనరల్ కాన్ఫరెన్స్‌కు ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో భాగంగా అమెరికా అధికారులతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.
వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు:
వచ్చే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగం ఉంది. నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయగలదా అని అడిగిన ప్రశ్నకు… ‘‘మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము’’ అని అమిత్ షా గూఢమైన సమాధానం ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీసింది.
సానియా, షమీ పెళ్లి:
సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి చేసుకున్నట్లు నెట్టింటి జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోస్ అన్ని ఫేక్. కొందరు ఆకతాయిలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సానియా, షమీ పెళ్లి చేశారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సానియా, షమీ పెళ్లి చేసుకోలేదు.. వారి కెరీర్‌తో బిజీగా ఉన్నారు. మరి ఈ ఫోటోలపై ఇద్దరు స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
బన్నీని కడిగిపారేస్తానంటున్న గరికపాటి:
‘పుష్ప’ సినిమాలోని “తగ్గేదేలే” అనే డైలాగ్ పై గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. “స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా.. రేపు ఏ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు.. దానికి ఎవరు కారణం..? ఆ సినిమా డైరెక్టర్, హీరో కనబడితే కడిగిపారేస్తాను” అని గరికపాటి మండిపడ్డారు. ఇదే సమయంలో… తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు, శ్రీరామ చంద్రుడు వంటి వారు అనాలి కానీ.. ఓ స్మగ్లర్ అనడం ఏమిటి? అంటూ గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు! ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ… తాజా పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
సర్ ప్రైజ్ గెస్ట్:
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం గ్రాండ్ ప్లానింగ్స్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్లానింగ్స్ లో జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్ ప్రైజ్ గెస్ట్ ను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మరి దీని ప్రకారం ఆ అతిధి ఎవరో కాదు మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.